National

యూపీలో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు సిద్దమవుతున్న సీఎం యోగీ ఆదిత్యనాథ్..

యూపీలో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు సిద్దమవుతున్న సీఎం యోగీ ఆదిత్యనాథ్.. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతమైన బుందేల్ ఖండ్ లో వినిపించే ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ లకు చెక్ పెట్టేలా కీలక నిర్ణయం తీసుకున్నారు.

తాజాగా జరిగిన యూపీ కేబినెట్ భేటీలో బుందేల్ ఖండ్ లో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించేలా ఓ ప్రత్యేక సంస్ధ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఈ సంస్ధ ఏర్పాటు కాబోతోంది.

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా తరహాలో వెనుకబడిన బుందేల్‌ఖండ్‌ ప్రాంతాన్ని కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు యోగి ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం పరిశ్రమల ఏర్పాటును సులభతరం చేసేలా బుందేల్‌ఖండ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ (బిడా)ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన నిన్న జరిగిన యూపీ కేబినెట్ సమావేశం బుందేల్‌ఖండ్‌కు ఈ అథారిటీని ఏర్పాటు చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దీంతో పాటు మరో 15 ప్రతిపాదనలకు యూపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

యూపీ కేబినెట్ ఆమోదించిన నిర్ణయాల్లో వరికి కనీస మద్దతు ధర పెంపు, నష్టాల్లో ఉన్న టూరిస్ట్ గెస్ట్ హౌస్, అయోధ్యలోని ఫెసిలిటేషన్ సెంటర్‌ను ప్రైవేట్ పబ్లిక్ పార్టనర్‌షిప్ మోడ్‌లో నిర్వహించాలనే ప్రతిపాదనతో సహా 15 ఇతర ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. బుందేల్ ఖండ్ పారిశ్రామిక అభివృద్ధి అథారిటీ బిడా కోసం 16,565 హెక్టార్ల భూమిని సేకరించనున్నట్లు రాష్ట్ర ఇంధన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎకె శర్మ తెలిపారు. దీనిపై మొదటి దశలో 13 గ్రామాల నుంచి 6,115 హెక్టార్ల భూమిని సేకరించనున్నారు.

ఈ ప్రాంతాన్ని భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించడానికి రాష్ట్ర ప్రభుత్వం బుందేల్‌ఖండ్‌లోని ఝాన్సీ వద్ద విమానాశ్రయాన్ని కూడా నిర్మిస్తుంది. అలాగే రక్షణ కారిడార్‌లోని ఝాన్సీ నోడ్‌కు 70 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి నంబర్ 44, 27 వద్ద ప్రతిపాదిత అథారిటీ కోసం భూమిని గుర్తించినట్లు శర్మ తెలిపారు. బుందేల్‌ఖండ్‌ను పరిశ్రమల హబ్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని శర్మ చెప్పారు.