APNational

ముత్యపుపందిరి వాహనంపై కాళీయమర్ధన అలంకారంలో శ్రీ మలయప్ప !

తిరుమల/తిరుపతి: కలియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువుతీరిన తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు తిరుమలలో ఉదయం, రాత్రి శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్బంగా వాహన సేవలు నిర్వహిస్తున్నారు.

తిరుమల మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా జరగుతున్న వాహన సేవలు కళ్లారా చూడటానికి వేలాది మంధి భక్తులు వేచి ఉన్నారు.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు బుధవారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవితో కలిసి కాళీయమర్ధన అలంకారంలో దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహనసేవలో వివిధ కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని వాహనసేవలో దర్శించుకున్నారు.

ముత్యపుపందిరి వాహనం

ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు రాత్రి శ్రీ మలయప్పస్వామివారు ముత్యపుపందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. జ్యోతిషశాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను తెలియజేస్తుంది. శ్రీకృష్ణుడు ముక్కుపై, మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల్లో ఉంది.

ఆదిశేషుని పడగలను ముత్యాల గొడుగా పూనిన స్వామివారిని దర్శించినా, స్తోత్రం చేసినా సకల శుభాలు కలుగుతాయని పురాణ ప్రశస్తి. చల్లని ముత్యాలకింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి, భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూర్చుతుంది. వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబరు 22న గరుడసేవ నాడు విశేషంగా భక్తులు తిరుమలకు చేరుకుంటారు. ఘాట్ రోడ్లలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సెప్టెంబరు 21వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి సెప్టెంబరు 23వ తేదీ ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలను టీటీడీ రద్దు చేసింది. తిరుపతిలోని అలిపిరి పాత చెక్ పాయింట్ వద్ద ద్విచక్ర వాహనాలను పార్క్ చేసుకునే సదుపాయాన్ని టీటీడీ కల్పిస్తుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేయడమైనది.