National

న్యూఢిల్లీ: ఉగ్రవాదులు, అతివాదులకు స్వర్గధామంగా కెనడా మారిందని భారత్ తీవ్రం

న్యూఢిల్లీ: ఉగ్రవాదులు, అతివాదులకు స్వర్గధామంగా కెనడా మారిందని భారత్ తీవ్రంగా ధ్వజమెత్తింది. ఖలిస్థాన్ ఉగ్రవాదుల అంశంపై కెనడా(Canada) వ్యవహరిస్తున్న తీరుపై మండిపడింది.

కెనడా, భారత్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చి గురువారం మీడియాతో మాట్లాడారు.

ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(Justin Trudeau) చేసిన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవని ధ్వజమెత్తారు. భద్రతాపరమైన పరిస్థితుల కారణంగానే కెనడియన్లకు వీసా సర్వీసులను నిలిపివేసినట్లు ధృవీకరించారు.

భారత్‌పై కెనడా చేసిన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవేనని స్పష్టం చేశారు.

హర్దీప్ సింగ్ నిజ్జర్ ఘటన గురించి కెనడా దేశం భారత్‌కు అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అరీందమ్ బాగ్చి తెలిపారు. అయితే, కెనడా గడ్డపై జరుగుతున్న నేరపూరిత కార్యకలాపాలు, వ్యతిరేక శక్తులకు సంబంధించిన అన్ని ఆధారాలను ఆ దేశానికి ఇచ్చామని.. గత కొన్నేళ్లుగా దాదాపు 20-25 మంది వ్యక్తులను మనదేశానికి అప్పగించాలని కెనడాను కోరామన్నారు. అయితే, అటు వైపు నుంచి ఎలాంటి స్పందనా రాలేదన్నారు.

మన డిమాండ్లపై కెనడా ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు బాగ్చి. ఆ దేశం వ్యవస్థీకృత నేరాలకు అడ్డాగా మారిందని.. ఉగ్రవాదులు, అతివాదులకు స్వర్గధామంగా కెనడా ఉంటోందని అరీందమ్ బాగ్చి విమర్శించారు. అంతర్జాతీయంగా పోతున్న పరువు గురించి కెనడా ఆలోచించుకోవాలని హితవు పలికారు.

మరోవైపు, కెనడాలో ఉన్న మన దౌత్యవేత్తల కంటే.. భారత్‌లో ఉన్న ఆ దేశ దౌత్యవేత్తల సంఖ్య చాలా ఎక్కువగా ఉందన్నారు. ఈ విషయంలో ఇరుదేశాల మధ్య సమానత్వం ఉండాలన్నారు. అంతేగాక, భారత అంతర్గత వ్యవహారాల్లో కెనడా దౌత్యవేత్తలు జోక్యం చేసుకుంటున్నారని మండిపడ్డారు. కెనడా తమ దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు. అయితే, మనదేశంలో ఉన్న విదేశీ దౌత్యవేత్తలకు పూర్తి భద్రత కల్పిస్తున్నామన్నారు. కెనడా కూడా భారత దౌత్యవేత్తల భద్రత పట్ల అంతే నిబద్ధతతో ఉండాలని కోరున్నట్లు పేర్కొన్నారు. ట్రూడో ఆరోపణలను ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లామని.. ఆయన వాటిని తోసిపుచ్చారని తెలిపారు.

కెనడాలో భారత పౌరులకు అడ్వైజరీ.. కెనడియన్ల వీసాల నిలిపివేత

దౌత్య ఉద్రిక్తతల నేపథ్యంలో కెనడాలోని భారత పౌరులకు అడ్వజైరీ జారీ చేశామని, ఎలాంటి సమస్య ఎదురైనా వారు కాన్సులేట్ సంప్రదించవచ్చని అరిందమ్ తెలిపారు. మరోవైపు, ఆ దేశంలో మన హైకమిషన్లు, కాన్సులేట్లను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు పెరుగుతున్నాయన్నారు. ఇవి సాధారణ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నాయని తెలిపారు.