National

కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలు

కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా అసంఘటిత రంగంలోని కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు నెల నెలా వారికి పెన్షన్ అందించనుంది.

వయసు పై బడిన తర్వాత ఎవరిపై ఆధారపడకుండా ఉండేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చింది.

అరుణ్ జైట్లీ ప్రకటించారు:అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అటల్ పెన్షన్ యోజన ప్రకటించారు. అనంతరం మే 9 2015న కోల్‌కతా వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించారు. 60 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత నెల నెలా పెన్షన్ కింద కొంత మొత్తాన్ని అందుకోవచ్చు. ఎలా చేరాలి? అనే విషయమై పూర్తి వివరాలు తెలుసుకుందాం.

భార్యాభర్తలిద్దరూ..:ఇందులో చేరేవారు గతంలో ఏ పథకంలోను చేరకుండా ఉండాలి. 60 ఏళ్లు దాటిన తర్వాత నెలకు రూ.వెయ్యి నుంచి రూ.5వేల వరకు హామీ ఉంటుంది. భార్యాభర్తలిద్దరూ ఇందులో చేరవచ్చు. ఒక్కొక్కరికి నెలకు రూ.5వేలు వచ్చేలా ప్రీమియం చెల్లిస్తే బాగుంటుంది. దీనివల్ల మలివయసులో చెరొక రూ.5వేల చొప్పున రూ.10వేలు అందుకోవచ్చు.

ఆటో డెబిట్ ద్వారా..:అటల్ పెన్షన్ స్కీమ్‌లో 18 సంవత్సరాల వయసులో చేరినట్లయితే నెలకు రూ. 42 చెల్లించాల్సి ఉంటుంది. వయసు పెరిగే కొద్ది ప్రీమియం పెరుగుతుంది. 40 ఏళ్ల వయసులో చేరితే నెలకు రూ. 210 చెల్లించాలి. బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటో డెబిట్ ద్వారా అమౌంట్ చెల్లించేలా ఆప్షన్ పెట్టుకోవచ్చు. మూడు, ఆరు, ఏడాదికి ఒకసారి కూడా ప్రీమియం చెల్లించవచ్చు. ఫోన్ నెంబరు పనిచేస్తుండాలి. మీకు దగ్గరలోని ఏ ప్రభుత్వరంగ బ్యాంకుకైనా వెళ్లి ఆధార్, మొబైల్ నెంబరు ఇచ్చి దరఖాస్తు పూర్తిచేయడంద్వారా అటల్ పెన్షన్ యోజన ఖాతా తెరవొచ్చు.