బస్సు, రైలు, విమానాల్లో ప్రయాణిస్తున్నప్పుడు మద్యం తాగిన వారు వింతగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా ఓ యువకుడు రైలులో వృద్ధ జట్టపై మూత్రవిసర్జన చేశాడు.
ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ AC కోచ్‌లో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అక్టోబర్ 4వ తేదీ బుధవారం మధ్యప్రదేశ్‌లోని హర్పాల్‌పూర్ నివాసి డాక్టర్ జిఎన్ ఖరే, అతని 60 ఏళ్ల భార్య ఉత్తర ప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో న్యూఢిల్లీకి బయల్దేరారు.
వారు B-3 కోచ్ లోని 57, 60 బెర్త్‌లలో వీరు నిద్రిస్తున్నారు. నైరుతి ఢిల్లీకి చెందిన రితేష్ కూడా అదే కంపార్ట్‌మెంట్‌లోని సైడ్ లోయర్ బెర్త్‌పై ప్రయాణిస్తున్నాడు. అతను మహోబా నుంచి హజ్రత్ నిజాముద్దీన్ వెళ్తున్నాడు. రైలు ఝాన్సీ జంక్షన్ సమీపంలో రాగానే మద్యం మత్తులో ఉన్న రితేష్ నిద్ర లేచి సీటు పై కూర్చిని అక్కడే మూత్రం పోశాడు. కింద ఉన్న వృద్ధ దంపతులపై మూత్రం పడింది. వారు వారించినా కూడా రితేష్ మూత్ర విసర్జన చేస్తునే ఉన్నాడు.
వృద్ధుల కేకలు విన్న పక్క కంపార్టమెంట్ వారు వచ్చి రితేష్ ను కిందికి దించారు. అనంతరం అతడిని రైల్వే పోలీసులకు అప్పగించారు. B-3 కోచ్ లోని 57, 60 బెర్త్‌లను శుభ్రం చేసిన తర్వార రైలు ముందుకు కదలింది. దీనిపై వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము అరిచినా యువకుడు పట్టించుకోలేదని వారు వాపోయారు. “నిందితుడైన రితేష్‌పై రైల్వే చట్టం 145 (మద్యపానం లేదా ఇబ్బంది) కింద కేసు నమోదు చేశాం” అని ఉత్తర మధ్య రైల్వేలోని ఝాన్సీ డివిజన్ PRO మనోజ్ సింగ్ తెలిపారు.
ఈ కేసులో నిందితుడికి బెయిల్ మంజూరు అయింది. గతంలో విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. జులైలో అమెరికాకు చెందిన ఓ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ మహిళ విమానం ఫ్లోర్‌పైనే మూత్ర విసర్జన చేశారు. రెస్ట్‌రూమ్ వినియోగించుకొనేందుకు విమాన సిబ్బంది అనుమతించకపోవడం వల్లే తాను అలా చేసినట్టు ఆ మహిళ చెప్పారు. వ్యవహారాన్ని క్యాబిన్ సిబ్బంది వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
జూన్ లో ఎయిరిండియా విమానంలో ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. అనంతరం అక్కడే ఉమ్మివేశాడు. ఢిల్లీ పోలీసులు నిందితుడిని అక్కడి నుంచి అరెస్ట్ చేశారు. ముంబై నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది.