National

ఖానాపూర్‌లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రేఖానాయక్ పార్టీకి గుడ్‌బై

ఖానాపూర్‌లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రేఖానాయక్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. బీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, రాజీనామా చేసినా ఆమె పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

అలాగే, తెలంగాణ ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. తెలంగాణ సిఎం కెసిఆర్ మాటతప్పారని, కెటిఆర్ చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్తానని అన్నారు. వచ్చే ఎన్నికలో తాను పోటీచేస్తానని, బిఆర్ఎస్ అభ్యర్థి ఎలా గెలుస్తారో నేను చూస్తానని సవాలు విసిరారు.

నాపై లేని పోని ఆరోపణలు చేశారు : అయితే, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. కేటీఆర్ తన ఫ్రెండ్ కోసం తనకు టికెట్ ఇవ్వలేదని మీడియా ముందు వాపోయారు. నేనేమైనా తప్పులు చేశానా అంటూ బిఆర్ ఎస్ పార్టీని నిలదీశారు. ఏమైనా కుంభకోణాలు చేశానా అంటూ ప్రశ్నించారు. తనేంటో వచ్చే ఎన్నికల్లో నిరూపిస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల కోసం ఎలాంటి నిధులు కూడ సమకూర్చలేదని వాపోయారు. కెటిఆర్ స్నేహితుడైనా జాన్సన్‌కు టిక్కెట్ ఇచ్చాడని అన్నారు. నాపై లేని పోని ఆరోపణలు చేస్తున్నారు. నేనేమైనా భూములు కబ్జా చేశానా? ఏమైనా ఉంటే నిరూపించండి అంటూ బిఆర్ఎస్ పార్టీ పై సవాలు విసిరారు.

ఖానాపూర్‌ను అభివృద్ధి చేయలేదన్నారు : కెటిఆర్ స్నేహితుడు జాన్సన్ కోసం ఖానాపూర్‌లో అభివృద్ధి పనులను కూడా నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖానాపూర్ సదర్‌మట్ నిర్మిస్తామని కెసిఆర్ మాటిచ్చారని ఆ మాట తప్పారని అన్నారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామన్నారు. అదికూడా చేయలేదని వాపోయారు. ఖానాపూర్ నియోజకవర్గానికి కేటాయించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను, నిర్మల్‌, బోధ్‌కు తరలించారని అన్నారు. నా నిధులను ఆపినందుకు నేను పోరాటాన్ని మొదలుపెడతా అని రేఖానాయక్ అన్నారు. ఖానాపూర్ అభివృద్ధి చేయలేదని స్వయంగా కేటిఆర్ ఒప్పుకున్నారని మరో సారి గుర్తుచేశారు. అన్యాయంగా మా అల్లుడిని బదిలీచేశారు. వచ్చే ఎన్నికల్లో నేను తప్పకుండా పోటీలో పాల్గొంటాను. పాదయాత్రకు నేను రెడీ అవుతున్నాను. గ్రామాగ్రామాన పాద యాత్ర చేసి ప్రజలను కలుస్తాను. బిఆర్ఎస్‌ను తప్పకుండా ఓడిస్తానంటూ శపథం చేశారు.