National

రైతులకు శుభవార్త చెప్పిన కేంద్రం.. ఆరు పంటలకు మద్దతు ధర పెంపు

కేంద్ర క్యాబినెట్.. రైతులకు శుభవార్త చెప్పింది. 2024-25 సంవత్సరానికి గోధుమలతో సహా ఆరు రబీ పంటలకు కనీస మద్దతు ధరలను (MSP) కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించింది.

కందులపై క్వింటాల్ రూ. 425 రూపాయలు పెంచగా.. గోధుమలకు క్వింటాకు రూ. 150 పెంచారు. బార్లీ మద్దతు ధర క్వింటాకు రూ.115 పెంచారు. ధరల పెంపు తర్వాత గోధుమలు క్వింటాల్ కు రూ.2,275, బార్లీ క్వింటాల్ కు రూ. 1850, కందులకు క్వింటాల్ కు రూ. 6425 అవుతాయి.

పెంచిన ధరలు 2024-2025 నుంచి అమలులోకి రానున్నాయి.దేశంలోని యువత అభివృద్ధి కోసం మై భారత్ పేరుతో ఇన్ స్టిట్యూట్ ను ఏర్పటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రైల్వే ఉద్యోగులకు రూ. 1968.87 కోట్ల ఉత్పాదకత లింక్డ్ బోనస్ (పిఎల్‌బి)కి క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. పండుగ సీజన్‌కు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు కరువు భత్యాన్ని నాలుగు శాతం పాయింట్లు పెంచి 46 శాతానికి పెంచింది.

ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వివరించారు. లడఖ్‌లో 13 GW పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు కోసం 20,773 కోట్ల రూపాయలకు క్యాబినెట్ ఆమోదించినట్లు ఠాకూర్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ 713 కిమీ ట్రాన్స్‌మిషన్ లైన్‌లను ఏర్పాటు చేస్తారు. ఇది లేహ్, జమ్మూ అండ్ కాశ్మీర్‌లకు ప్రయోజనం చేకూరుస్తుంది.

వరికి మద్దతు ధర పెంచకపోవడంపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాయి. ముఖ్యంగా వరి పండించే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రైతులు మద్దతు ధర కోసం ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ వరికి మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ కూడా ఇస్తామని హామీ ఇచ్చింది.