National

జమ్మూకాశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌కి సంబంధం లేదు.. యూకే పార్లమెంట్‌లో పీఓకే ప్రొఫెసర్..

జమ్ము కాశ్మీర్ వివాదంలో పాకిస్తాన్‌కి సంబంధమే లేదని, పాక్ చట్టబద్ధమైన పార్టీనే కాదని పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)కి చెందిన రాజకీయ కార్యకర్త, ప్రొఫెసర్ సజ్జాద్ రజా అన్నారు.

బ్రిటన్ పార్లమెంట్ లో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పీఓకేలో ప్రజల్ని పాకిస్తాన్ జంతువుల్లా చూస్తోందని, జమ్మూ కాశ్మీర్ ప్రజలకు సౌకర్యాలను పొందే హక్కు ఉందని ఆయన అన్నారు. కొంతమంది బ్రిటీష్ ఎంపీలతో సహా పలువురు వక్తలు ఆర్టికల్ 370 తర్వాత కాశ్మీరీ పండిట్ల పోరాటాలు, జమ్మూ కాశ్మీర్ పురోగతిపై చర్చించారు.

1947 అక్టోబర్ 26న జమ్మూ కాశ్మీర్ భారత్ లో చేరి 76 ఏళ్లు అయిన సందర్భంగా జమ్మూ కాశ్మీర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని జరిపారు. జమ్మూ కాశ్మీర్ పై పాకిస్తాన్ కి హక్కు లేదని సజ్జద్ రజా స్పష్టం చేశారు. రజా పీఓకేలో నేషన్ ఈక్వాలిటీ పార్టీకి చెందిన వారు. జమ్మూ కాశ్మీర్ వివాదంలో రెండు పార్టీలు మాత్రమే ఉన్నాయని, ఒకటి భారత్ కాగా.. రెండోడి జమ్మూ కాశ్మీర్ అని ఆయన అన్నారు.

 

1947లో బ్రిటీష్ ప్రభుత్వం చేసిన తప్పులకు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్(పీఓజేకే)లో ప్రజలు ఇప్పటికి ఇబ్బందులు పడుతున్నారని, ఎలాంటి హక్కులు లేకుండా బతకాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సజ్జద్ రజా మాట్లాడుతూ.. నేను నా చేతిలో తుపాకీలతో ఈ గదిలోకి ప్రవేశిస్తే నన్ను తరిమేయాలని భావిస్తారు, చట్టబద్ద పార్టీగా గుర్తిస్తారా..? అంటూ పాకిస్తాన్ ను ఉద్దేశించి ప్రశ్నించారు.

మన ప్రాథమిక హక్కుల కోసం పాకిస్తాన్ ను ఎదురించాలి, మనల్ని జంతువులుగా చూడకూడదని, మనం కూడా మనుషులమే అని, శాంతియుతంగా జీవించడానికి, ఆధునిక సౌకర్యాలను ఆస్వాదించడానిక మాకు అన్ని హక్కులు ఉన్నాయని, జమ్మూ కాశ్మీర్ ,లడఖ్ లోని ప్రజలు జీవితాన్ని ఆనందిస్తున్నారని సజ్జద్ రజా అన్నారు. భారత్-పాక్ విభజన సమయంలో హిందువులు, సిక్కులపై జరిగిన దురాగతాలను కూడా ఆయన ప్రస్తావించారు.

ఈ కార్యక్రమాన్ని బ్రిటిష్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ ఏర్పాటు చేశారు. ఆర్టికల్ 370 తర్వాత జమ్మూ కాశ్మీర్ లోని పురోగతిని ఎంపీ థెరిసా విలియర్స్ ప్రశంసించారు. సీమాంత ఉగ్రవాదాన్ని ప్రొత్సహించొద్దని బాబ్ బ్లాక్‌మన్ పాకిస్తాన్ కి హితవు పలికారు. కాశ్మీరీ పండిట్ల సమస్యకు రాజకీయ సంకల్పం లేకపోవడం గురించి గౌతమ్ సేన్ మాట్లాడారు. ఓటు బ్యాంకు రాజకీయాలే ఇందుకు కారణమని ఆరోపించారు.