National

భారత్, మోడీపై అనుచిత వ్యాఖ్యలు: ముగ్గురు మాల్దీవుల మంత్రులపై వేటు, ప్రముఖుల కౌంటర్లు

భారత్, ప్రధాని నరేంద్ర మోడీపై మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారత పౌరుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. లక్షద్వీప్‌లో మోడీ పర్యటనను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై భారత ప్రముఖులు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. లక్షదీవుల అందాలను వివరిస్తూ సోషల్ మీడియా వేదికగా మాల్దీవుల మంత్రులకు కౌంటర్లు ఇస్తున్నారు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, జూనా అబ్రహాం, శ్రద్ధా కపూర్ వంటి వారు స్వదేశీ టూరిజానికి మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.

 

‘మాల్దీవుల మంత్రి చేసిన ద్వేషూరిత వ్యాఖ్యలు చూశాను. భారీ స్థాయిలో పర్యాటకులను పంపించే దేశం(భారత్)పై అలా మాట్లాడటం ఆశ్చర్యాన్ని కలిగించింది. పొరుగువారితో స్నేహంగా మెలగాలనే అనుకుంటాం. కానీ, ద్వేషాన్ని మేమెందుకు సహించాలి? ఎన్నోసార్లు మాల్దీవుల్లో పర్యటించా. ప్రతిసారీ ప్రశంసించా. ఆత్మగౌరవమే ఫస్ట్. భారత దీవుల్లో ప్రయాణిస్తూ.. మన పర్యాటకానికి మద్దతు తెలుపుదాం’ అని అక్షయ్ కుమార్ పిలుపునిచ్చారు.

 

‘లక్షద్వీప్‌లో అందమైన, పరిశుభ్రమైన బీచ్‌లలో ప్రధానమంత్రి మోడీని చూడటం ఎంతో బాగుంది. విశేషమేంటంటే అవి కూడా మనదేశంలోనే ఉండటం’ అని సల్మాన్ ఖన్ ట్వీట్ చేశారు. అతిథి దేవోభవ అనే సందేశంతో ఇచ్చే అద్భుతమైన భారతీయ ఆతీథ్యం, విస్తారమైన సముద్ర తీరం చూడాల్సిందే. ఇందుకోసం లక్షద్వీప్ నకు వెళ్లాల్సిందే అని మరో బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం పేర్కొన్నారు. అంతేగాక, అక్కడి బీచ్ ఫొటోలను పంచుకున్నారు. సుందరమైన బీచ్ లకు నెలవైన అందాలను చూసేందుకు ఈ ఏడాది ప్లాన్ చేసుకుంటున్నానని బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ పేర్కొన్నారు.

 

మరోవైపు, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా లక్షద్వీప్ అందాలపై స్పందించారు. ‘సింధూదుర్గ్ లో ఇటీవల పుట్టిన రోజు వేడుకలను చేసుకున్నా. మాకు కావాల్సినవన్నీ లభించాయి. అందమైన ప్రదేశాలు, అద్భుతమైన ఆతిథ్యం ఎన్నో జ్ఞాపకాలను అందించాయి. ఎన్నో అందమైన, సహజ దీవులకు భారత్ నెలవు. చూడాల్సిన ప్రదేశాలు, ఎన్నో జ్ఞాపకాలను పదిలపరచుకోవడానికి వేచి చూస్తోంది’ టెండూల్కర్ ట్వీట్ చేశారు. అక్కడ క్రికెట్ ఆడిన వీడియో, బీచ్ ఫొటోను సచిన్ పంచుకున్నారు. మరో క్రికెటర్ హార్థిక్ పాండ్యా కూడా లక్షద్వీప్ పర్యటనకు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు.

 

ఇది ఇలావుండగా, భారత్, ప్రధాని నరేంద్ర మోడీపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల మంత్రులను అక్కడి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇటీవల ప్రధాని మోడీ లక్షద్వీప్ సందర్శించి, అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ పర్యటనపై మాల్దీవుల మంత్రులు, నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో భారత్, మోడీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసిన మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం ఆదివారం సస్పెండ్ చేసింది. మంత్రులు మరియం షియానా, మల్షా షరీఫ్, అబ్దుల్లా మజూమ్ మాజీద్‌లను సస్పెండ్ చేశారు.

 

కాగా, ప్రధాని మోడీని విదూషకుడు, తోలుబొమ్మ అంటూ వ్యాఖ్యానించారు మంత్రి మరియం షియానా. ఆమె పోస్టుపై తీవ్ర వ్యతిరేకత రావడంతో తర్వాత దాన్ని డిలీట్ చేసింది. ‘డబ్బు సంపాదించడానికి శ్రీలంక వంటి చిన్న ఆర్థిక వ్యవస్థల్ని భారత్ కాపీ కొడుతుంది’ అని ప్రధాని లక్షదీప్ పర్యటనపై మల్దీవుల రాజకీయ నేత జహిద్ రమీజ్ వ్యాఖ్యానించాడు. భారత్ ఆలోచన భ్రమ కలిగిస్తోందని.. వారు మేము అందించే సేవల్ని ఎలా అందిస్తారు.. వారి తీరం, గదుల్లో వాసన వస్తుంది అంటూ పేర్కొన్నారు. అయితే, మాల్దీవుల ప్రభుత్వం తమ దేశ మంత్రులు, నేతల వ్యాఖ్యలను ఖండించింది. ఈ క్రమంలోనే వారిపై చర్యలు తీసుకుంది.

 

మరోవైపు, మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలపై భారతీయులు తీవ్రంగా స్పందిస్తున్నారు. త్వరలో మాల్దీవుల్లో పర్యటించాలనుకున్న వాళ్లు కూడా తమ ప్రయత్నాలను విరమించుకుంటామని చెప్పారు. వేలాది మంది తమ మాల్దీవుల పర్యటలను రద్దు చేసుకున్నారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో మాల్దీవులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.