అయోధ్యలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రామమందిరం ఈ నెల 22న ప్రారంభించననున్నారు. ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. అయితే, అయోధ్య రామమందిరానికి మొదటి బంగారు తలుపును ఏర్పాటు చేశారు. గర్భగుడి మొదటి అంతస్తులో బంగారు తలుపును ఏర్పాటు చేయడం జరిగింది. గర్భగుడి పై అంతస్తులో 12 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు ఉన్న బంగారు తలుపును అమర్చడం జరిగింది. మరో మూడు రోజుల్లో మరో 13 బంగారు తలుపులు ఆలయంలో ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.
అయోధ్య శ్రీరాముని ఆలయంలో మొత్తం 46 తలుపులను ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో 42 తలుపులకు బంగారు పూత పూయనున్నట్లు ఉత్తరప్రదేశ్ సిఎంఓ కార్యాలయం వెల్లడించింది. జనవరి 22న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం కారణంగా ఈ రోజు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు సిఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.
ఆలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆ రోజంతా ఉత్తరప్రదేశ్‌లో మద్యం అమ్మకాలను నిషేదించడం జరిగిందని ముఖ్యమంత్రి తెలిపారు. కాగా, అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రాజకీయ నాయకులు, బాలీవుడ్ ప్రముఖులు, క్రికెటర్లు, పారిశ్రామికవేత్తలతో పాటు 7,000 మందికి పైగా వ్యక్తులకు రామమందిర ఆహ్వాన పత్రికలు అందాయి.
ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి విచ్చేయనున్న ప్రముఖులు..
అయితే, రామమందిర వేడుకల ఏర్పాట్లను సమీక్షించేందుకు అయోధ్యకు వచ్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలో పరిశుభ్రత పాటించేలా కుంభ్ మోడల్ ను అమలు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది. జనవరి 14న అయోధ్యలో పరిశుభ్రత ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు యూపీ సిఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. జనవరి 22 వతేదీన అయోధ్య ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఆలయాన్ని విద్యుత్‌దీపాలంకరాలతో అలంకరించనున్నారు.
ఈ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి అతిరథ మహాశయులందరూ విచ్చేయనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రత్యేక ఆహ్వానితులుగా నిలవనున్నారు. ఆలయ ట్రస్ట్ శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం ఆహ్వానితుల జాబితాలో బాలీవుడ్ ప్రముఖులు, ఇక సౌత్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్ వంటి వారికి అయోధ్య ఆహ్వాన పత్రికలు అందాయి. వీరితో పాటు క్రికెటర్లు, పారిశ్రామికవేత్తలకు కూడా ఆహ్వానాలు అందాయి