National

చమురు ధరల భగ్గు.. 4% పెరుగుదల..

పశ్చిమదేశాలు, హౌతీ రెబెల్స్ దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఎర్ర సముద్రంలో వాణిజ్యనౌకలను హౌతీలు లక్ష్యంగా చేసుకుంటున్న నేపథ్యంలో చమురు సహా అన్ని సరుకుల రవాణాకు తీవ్ర విఘాతం కలిగింది. హౌతీలను నిలువరించే లక్ష్యంతో అమెరికా, బ్రిటన్ యెమెన్‌లో వారి స్థావరాలపై ప్రతి దాడులు చేశాయి. పశ్చిమదేశాల సైనిక చర్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు హూంకరిస్తున్నారు.

 

ఈ నేప్యథంలో కొత్త ఏడాదిలో తొలిసారిగా చమురు ధరలు 4% పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ 80.71 డాలర్లకు చేరింది. మున్ముందు ఇవి ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. ముడి చమురు బ్యారెల్‌కు 10 డాలర్లు, సహజవాయువు ధర 25% మేర పెరగొచ్చని చమురు రంగ నిపుణులు అనుమానిస్తున్నారు. అమెరికా వెస్ట్ టెక్సాస్ క్రూడ్ ధర 2.79 శాతం పెరిగి బ్యారెల్ 74.03 డాలర్లకు చేరింది.

 

ద్రవ్యోల్బణం ఇటీవల తగ్గుముఖం పడుతుండటంతో పలు దేశాలు ఊపిరి తీసుకుంటున్నాయి. ఈ దశలో చమురు ధరల పెరుగుదలతో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. క్రూడాయిల్ ధరలు పెరిగితే ఆ ప్రభావం అంతటా ఉంటుంది. ఎర్రసముద్రం ద్వారా వర్తక, వాణిజ్యం ఎంతో కీలకం. సముద్ర వాణిజ్యంలో 30 శాతం ఈ మార్గం గుండానే జరుగుతోంది.

 

ఎర్రసముద్రం మీదుగా 14 ట్రిలియన్ డాలర్ల విలువైన సరుకు రవాణా సాగుతోంది. పశ్చిమాసియా, యూరప్ మధ్య వర్తక, వాణిజ్యానికి అతి దగ్గర సముద్ర మార్గం ఇదే. ఇంగ్లిష్ చానెల్, పనామా కాల్వ తర్వాత అత్యంత బిజీగా ఉండే రూట్ కూడా ఇదే. 2021లో సూయిజ్ కెనాల్ మూతపడినప్పుడు అంతర్జాతీయంగా 9.6 బిలియన్ డాలర్ల విలువైన సరుకు రవాణా నిలిచిపోయింది.

 

ఇప్పుడు ఎర్రసముద్రంలో అలజడుల కారణంగా నౌకలు తమ మార్గాన్ని మళ్లించుకుంటున్నాయి. ఎర్రసముద్రం దక్షిణాన ఉన్న బాబ్ అల్-మండేబ్ జలసంధి గుండా రవాణాను నిలిపివేస్తున్నట్టు డానిష్ ఆయిల్ ట్యాంకర్ గ్రూప్ టార్మ్ ప్రకటించింది. మదరా సిల్వర్, హఫీనియా థేమ్స్, ఫ్రీ స్పిరిట్, ఫ్రంట్ ఫ్యూజన్, గమ్స్‌నోరో తదితర ఆయిల్ ట్యాంకర్లు కూడా మార్గాన్ని మళ్లించుకోవడమో, రవాణాను నిలిపివేయడమో చేశాయి. దూరాభారం కారణంగా సరుకుల ధరలు పెరుగుతాయి. దీనికి చమురు ధరల పెరుగుదల తోడు అయితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.