ఇంకొన్ని గంటలు. 500 సంవత్సరాల నాటి భారతీయుల కల సాకారం కాబోతోంది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు జన్మించిన పుణ్యస్థలం అయోధ్యలో.. సరయూ నదీ తీరం ఒడ్డున నిర్మితమైన రామమందిరం ప్రారంభం కాబోతోంది. రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం మొదలుకానుంది.
ఈ కార్యక్రమం కోసం అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇక్కడి ఆలయాలు, ప్రధాన మార్గాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. రామ నామ జపంతో ఈ నగరం మారుమోగిపోతోంది. సరయూ నది తీరం మొత్తం రామభక్తులతో నిండిపోయింది. ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోందక్కడ.
అయోధ్య రామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించడానికి 7,000 మందికి పైగా ప్రముఖులు హాజరు కానున్నారు. వారంతా ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
దిగ్గజ పారిశ్రామికవేత్తలు, సామాజికం, సినిమా, క్రీడారంగానికి చెందిన సెలెబ్రిటీలు అయోధ్యకు చేరుకున్నారు. ఈ మహోత్సవంలో పాల్గొనడానికి మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు ఇప్పటికే ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. వారిద్దరూ అయోధ్యకు బయలుదేరి వెళ్లారు.
అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలు వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆరంభం అయ్యాయి. వివిధ దేవతా మూర్తులకు మంగళస్నానాలను చేయించారు అర్చకులు. సరయూ నది నుంచి తెచ్చిన పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. సరయూ నుంచి 108 కళశాలతో తెచ్చిన నీటిని దీనికోసం వినియోగించారు.
అభిషేకానంతరం విగ్రహాలను అందంగా అలంకరించారు. ధూప, దీపాలను వెలిగించారు. ఉత్తరప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన 50 మందికి పైగా వేద పండితులు, అర్చకులు ఈ కార్యక్రమాన్ని అప్రతిహతంగా నిర్వహించారు. అనంతరం రామ్ లల్లా విగ్రహానికి సంప్రదాబద్ధంగా పూజలను నిర్వహిస్తారు.