National

రామజ్యోతి వెలిగించిన ప్రధాని మోడీ..

చారిత్రక అయోధ్యలో సోమవారం మధ్యాహ్నం రామమందిర ప్రారంభోత్సవం వైభవోపేతంగా జరిగింది. ఈ వేడుకను పురస్కరించుకుని రాత్రికి ఇళ్లలో దీపాలు వెలిగించాలని.. దీన్ని దీపావళి పండగలా చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఢిల్లీలోని తన నివాసంలో ప్రధాని మోడీ.. దీపాలు వెలిగించారు. శ్రీరాముడి చిత్రపటానికి హారతి ఇచ్చారు.

 

ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. రామజ్యోతి(Ram Jyoti) అంటూ మోడీ పేర్కొన్నారు. రామ మందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ట నేపథ్యంలో దేశ వ్యాప్తంగానూ ప్రజలు ఆనందోత్సాహాల మధ్య ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దేశ వ్యాప్తంగా ఆలయాలు, నివాసాల్లో దీపాలు వెలిగించి సంబరాలు చేసుకుంటున్నారు రామభక్తులు. సోమవారం మధ్యాహ్నం ప్రధాని మోడీ చేతులమీదుగా రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రామన్ని నిర్వహించిన విషయం తెలిసిందే.

 

సరయూ నది తీరాన దీపోత్సవం

 

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం పురస్కరించుకుని సరయూ నది తీరాన దీపోత్సవం కన్నులపండగా సాగింది. సరయూ నది తీరాన భక్తులు 14 లక్షల దీపాలు వెలిగించారు. దేశీయంగా తయారు చేసిన మట్టి ప్రమిదలతో దీపాలంకరణ చేశారు. వేలాది మంది భక్తులు దీపోత్సవంలో పాల్గొన్నారు. అయోధ్యలోని హనుమాన్ హనుమాన్ గర్హి ఆలయంలో దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

 

మరోవైపు, జనక్ పూర్ ధాంలోని జానకి ఆలయంలో కూడా దీపోత్సవం నిర్వహించారు. కాగా, రామలల్లా ప్రాణప్రతిష్ఠ సందర్భంగా తమ ఇళ్లలో దీపాలు వెలిగించి పేదలకు భోజనం పెట్టాలని అన్నారు ప్రధాని మోడీ. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రులు, ప్రముఖులతోపాటు సామాన్య ప్రజలు కూడా తమ నివాసాల్లో దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు.