National

అయోధ్య రాముడు.. ఇక ‘బాలక్‌ రామ్‌’గా దర్శనం..

శతాబ్దాల స్వప్నం సాకారమై అయోధ్య (Ayodhya Ram Mandir)లోని నవ నిర్మిత భవ్య మందిరంలో శ్రీరాముడు కొలువుదీరాడు. ప్రధాని చేతులమీదుగా గర్భగుడిలో శాస్త్రోక్తంగా జరిగిన ప్రాణ ప్రతిష్ఠ వేడుక చూసి భక్తజనం పులకించిపోయింది. అయితే, ఈ ఆలయంలో నూతనంగా ప్రతిష్ఠించిన రామ్‌లల్లాను ఇకపై ‘బాలక్‌ రామ్‌ (Balak Ram)’గా పిలవనున్నారు. ఈ విషయాన్ని ఆలయ ట్రస్ట్‌ పూజారి అరుణ్‌ దీక్షిత్‌ వెల్లడించారు.

 

జనవరి 22న ప్రతిష్ఠించిన శ్రీరాముడి విగ్రహానికి ‘బాలక్‌ రామ్‌’గా పేరు పెట్టామని అరుణ్ దీక్షిత్ వెల్లడించారు. అయోధ్యలో కొలువుదీరిన రామచంద్రమూర్తి ఐదేళ్ల పసిబాలుడిగా భక్తులకు దర్శనమిస్తున్నారన్నారు. అందుకే ఆ పేరును నిర్ణయించామని తెలిపారు. ఇకపై అయోధ్య రామ మందిరాన్ని బాలక్‌ రామ్‌ మందిరంగా పిలుస్తామని ఆయన పేర్కొన్నారు.

 

బాలరాముడి దర్శనానికి సామాన్య భక్తులను మంగళవారం నుంచి అనుమతించారు. ఇక, ప్రాణప్రతిష్ఠ పూర్తవడంతో హారతి వేళలు, పూజా కార్యక్రమాల్లో కొన్ని మార్పులు చేసినట్లు తెలిసింది. రోజుకు ఆరుసార్లు హారతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రస్ట్‌కు చెందిన ఆచార్య మిథిలేశ్‌నందిని శరణ్‌ వెల్లడించారు. ప్రతిరోజూ మంగళ (నిద్ర లేపేందుకు), శ్రింగార (అలంకరణ సేవలో), భోగ (నైవేద్య సమర్పణ వేళ), ఉతపన్‌ (దిష్టి తగలకుండా), సంధ్యా (సాయంత్రం వేళ), శయన హారతి (స్వామి వారిని నిద్ర పుచ్చేందుకు) ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

 

బాల రాముడికి పూరి, కూరతో పాటు రబ్‌డీ-ఖీర్‌, పాలు, పండ్లు, పాలతో చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పించనున్నారు. సోమవారం తెలుపు, మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపు, శుక్రవారం గోధుమ, శనివారం నీలం, ఆదివారం గులాబీ రంగు వస్త్రాల్లో ‘బాలక్‌ రామ్‌’ దర్శనమిస్తారు.