National

బడ్జెట్ సమావేశాలు.. ఎంపీలందరిపై సస్పెన్షన్ ఎత్తివేత….

దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించాయి. ఇంకో నెల రోజుల్లో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. మార్చి రెండో వారం నాటికి దీన్ని విడుదల చేయడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటోంది. ఏప్రిల్/మేలల్లో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుంది.

 

ఈ పరిస్థితుల్లో పార్లమెంట్ సమావేశం కాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంకొన్ని గంటల్లో లోక్‌సభ, రాజ్యసభలు సమావేశమౌతాయి. ఇవి- ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు. బుధవారం ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు.

 

ఎల్లుండి.. అంటే ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రతిపాదనలను సభకు సమర్పిస్తారు. మూడు నెలల కాలానికి మాత్రమే సరిపడేలా బడ్జెట్ కేటాయింపులు ఉండొచ్చని అంచనా వేస్తోన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు అవసరమైన ఆర్థిక లావాదేవీలను నిర్వహించడానికి అవసరమైనంత మేర కేటాయింపులు ఉంటాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత మరోసారి సభ సమావేశమౌతుంది.

 

కాగా- బడ్జెట్ సమావేశాలు ఆరంభం కావడానికి కొన్ని గంటల ముందు రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. 11 మంది సభ్యులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రెటరీ జనరల్ ఉత్తర్వులను జారీ చేశారు.

 

కాంగ్రెస్‌కు చెందిన జేబీ మాథర్, ఎల్ హనుమంతయ్య, నీరజ్ డాంగీ, రాజమణి పాటిల్, కుమార్ కేత్కర్, జీసీ చంద్రశేఖర్‌, సీపీఐ సభ్యులు బినోయ్ విశ్వం, పీ సంతోష్ కుమార్, సీపీఎం- జాన్ బ్రిట్టాస్, ఏఏ రహీం, డీఎంకే- మహ్మద్ అబ్దుల్లాపై విధించిన సస్పెన్షన్ ఎత్తేసినట్లు తెలిపారు. వారంతా రాష్ట్రపతి ప్రసంగానికి హాజరవుతారు.