National

సూర్యఘర్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు రూ. 78 వేల సబ్సిడీ..

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సౌర విద్యుత్ వినియోగాన్ని మరింత విస్తరించి సామాన్యులపై కరెంట్ ఛార్జీల భారం తగ్గించేందుకు కేంద్రం సరికొత్త పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’కు గురువారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకంతో కోటి ఇళ్లకు ప్రతినెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనుంది.

 

కేబినెట్ నిర్ణయాలపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. రూ. 75,021 కోట్లతో రూఫ్‌టాప్ సోలార్ స్కీంకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు చెప్పారు. 2025 నాటికి అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సోలార్ ప్యానళ్ల ఏర్పాటుకు సంబంధిత వెబ్‌సైట్‌లో గృహ వినియోగదారుల నుంచి దరఖాస్తు స్వీకరించనున్నట్లు వెల్లడించారు.

 

కాగా, అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ అనంతరం ప్రధాని మోడీ ఈ సోలార్ పథకాన్ని తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత బడ్జెట్‌లోనూ ఈ పథకానికి కేటాయింపులు చేశారు. ఫిబ్రవరి 13న ప్రధాని ఈ స్కీంను ప్రారంభించారు ప్రధాని మోడీ.

 

ఈ స్కీంలో దరఖాస్తు చేసుకున్నవారు ఒక కిలోవాట్ సోలార్ ప్యానళ్లకు రూ. 30 వేల వరకు సబ్సిడీ పొందవచ్చు. మిగిలిన మొత్తం బ్యాంకు రుణం కల్పిస్తారు. రెండు కిలోవాట్ లకు రూ. 60 వేలు, మూడు కిలో వాట్ అంతకంటే ఎక్కువ అయితే రూ. 78 వేలు రాయితీగా ఇస్తారు.