National

భారత రక్షణ వ్యవస్థలో మరో ఆయుధం..!

హిందూ మహాసముద్ర ప్రాంతంలో తన ఉనికిని పెంపొందించే ప్రయత్నంలో, భారత నావికాదళం లక్షద్వీప్‌లోని మినీకాయ్ దీవులలో INS జటాయు అనే కొత్త స్థావరాన్ని స్థాపించాలని యోచిస్తోంది. అంతేకాకుండా, ఐఎన్ఎస్ విక్రమాదిత్య మరియు ఐఎన్ఎస్ విక్రాంత్ అనే జంట విమాన వాహక నౌకల్లో భారత నావికాదళం తన కమాండర్ల సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశంలో, ఒక క్యారియర్ నుండి టేకాఫ్ అయి మరొకదానిపై ల్యాండింగ్ వంటి హై-టెంపో కార్యకలాపాలు నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమంలో ఒకే క్యారియర్ గ్రూప్‌కు చెందిన ఇతర యుద్ధనౌకలు మరియు సబ్‌మెరైన్‌లు కూడా పాల్గొంటున్నాయి.

 

వచ్చే వారం కొచ్చిలో మల్టీరోల్ హెలికాఫ్టర్ ఎంహెచ్-60 రోమియోని అధికారికంగా భారత రక్షణ వ్యవస్థలోకి ఇండియన్ నేవీ చేర్చుతుందని అధికారులు తెలిపారు.ప్రస్తుతం మినికాయ్ దీవుల్లోని బేస్‌లో తక్కువ మందితో కూడిన అధికార యంత్రాంగం పనిచేస్తుందని అయితే భవిష్యత్తులో మరింతగా విస్తరిస్తామని చెప్పారు. మాల్దీవ్స్‌కు 50 మైళ్ల దూరంలో ఉన్న ఈ నేవల్ బేస్‌ ఏర్పాటుతో మిలటరీతో పాటు ఇతర వాణిజ్య కార్యకలాపాలను సమీక్షించడం జరుగుతుందని చెప్పారు. అండమాన్‌లో ఉన్న ఐఎన్‌ఎస్ బాజ్ నేవల్ బేస్‌తో పోలి ఉండే ఐఎన్‌ఎస్ జటాయు స్థావరం కూడా అరేబియన్ సముద్ర తీరంలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది.

 

అమెరికా నుంచి ప్రభుత్వం-ప్రభుత్వం ఒప్పందంలో భాగంగా భారత్ కొనుగోలు చేసిన నాలుగు ఎంహెచ్-60 రోమియో మల్టీరోల్ చాపర్లను కూడా భారత నేవీ చేర్చనుంది. లక్షద్వీప్ ప్రాంతంలో తొలిసారిగా జంట క్యారియర్లతో కూడిన ఆపరేషన్స్‌ను భారత నావికాదళం ప్రదర్శించనుంది.అంతకుముందు ఈ జంట క్యారియర్లను విశాఖపట్నం వేదికగా జరిగిని మిలిన్ నావికా విన్యాసాల్లో ప్రదర్శించారు. ప్రపంచ మిలటరీ అవసరాలకు తగ్గట్టుగా ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లను భారత్ తయారు చేస్తోందనే సంకేతాలను పంపింది.