స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. గతంలో ఇచ్చిన గడువును పొడిగించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు దరఖాస్తును దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందనేది ఉత్కంఠతగా మారింది.
ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సమర్పించాలంటూ సుప్రీంకోర్టు.. గతంలో ఎస్బీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. రాజకీయ పార్టీలకు విరాళాలుగా ఇచ్చే ఎలక్టోరల్ బాండ్ల చెల్లుబాటుపై కిందటి నెల 15వ తేదీన సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
ఈ బాండ్లను జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు అయిదుమంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1) (ఎ)తో పాటు సమాచార హక్కు చట్టం ఉల్లంఘన కిందికి ఇవి వస్తాయని పేర్కొంది. ఎలక్టోరల్ బాండ్లను జారీ చేయడం క్విడ్ ప్రొ కొ కిందికి వస్తుందని స్పష్టం చేసింది.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నింటినీ ఈ నెల 6వ తేదీ నాటికి కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి సమర్పించాల్సి ఉంటుందని ఆదేశించింది. ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలు అంటే- వాటిని ఎవరు ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? మొత్తం ఎంత అనే వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది.
గడువు సమీపించిన నేపథ్యంలో ఎస్బీఐ.. సుప్రీంకోర్టు గడప తొక్కింది. ముందుగా ఆదేశించినట్లుగా మార్చి 6వ తేదీ నాటికి ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఈసీకి అందజేయలేమని తెలిపింది. గడువు పొడిగించాలని విజ్ఞప్తి చేసింది. జూన్ 30వ తేదీ వరకు గడువు కోరింది ఎస్బీఐ.