National

యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా.. కొత్త తేదీలివే..

యూపీఎస్సీ(UPSC) సివిల్ సర్వీసెస్, ఫారెస్ట్ సర్వీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అలర్ట్. సార్వత్రిక ఎన్నికలు జరగనున్న క్రమంలో అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష, ఫారెస్ట్ సర్వీసెస్ స్క్రీనింగ్ పరీక్షలు వాయిదా పడ్డాయి.

 

గతంలో వేర్వేరుగా ప్రకటించిన రెండు నోటిఫికేషన్ల ప్రకారం.. ప్రిలిమినరీ పరీక్ష మే 26న జరగాల్సి ఉంది. అయితే, లోక్‌సభ ఎన్నికలు జరగనున్న కారణంగా ఈ పరీక్షలను రీషెడ్యూల్ చేస్తూ యూపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు పరీక్షలను జూన్ 16న నిర్వహించాలని నిర్ణయించినట్లు యూపీఎస్సీ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది.

 

సివిల్ సర్వీసెస్‌లో 1056 ఉద్యోగాలు, ఫారెస్ట్ సర్వీసుల్లో 150 పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 14న యూపీఎస్సీ నోటిపికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దరఖాస్తుల గడువు మార్చి 6తో ముగిసింది. యూపీఎస్సీ మెయిన్స్ అక్టోబర్ 19న నిర్వహించనున్నారు. డిగ్రీ ఉత్తీర్ణులైన లక్షల మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా పరీక్ష తేదీలను మార్చింది యూపీఎస్సీ.

 

కాగా, కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏడు విడతల్లో దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ ప్రారంభమై.. జూన్ 1న ఏడో విడత పోలింగ్ ముగియనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.