TELANGANA

టీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్దులు ఖరారు – అనూహ్యంగా, లిస్టులో..!!

తెలంగాణలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్త చాటాలని ప్రయత్నిస్తోంది. బీజేపీ ఈ సారి తెలంగాణ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఇదే సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో వరుస చేరికలతో ఆ పార్టీలో కలకలం మొదలైంది. బీజేపీ ఇప్పటికే తమ అభ్యర్దులను ఖరారు చేసింది. కాంగ్రెస్ తమ అభ్యర్దులపైన నిర్ణయానికి వచ్చింది. తుది జాబితా ప్రకటనకు సిద్దమైంది.

 

ఎంపీ అభ్యర్దుల ఎంపిక : తెలంగాణలో పోటీ చేసే నలుగురు అభ్యర్దులను ఇప్పటికే కాంగ్రెస్ ఖరారు చేసింది. బీజేపీ, బీఆర్ఎస్ తమ అభ్యర్దుల పైన దాదాపు క్లారిటీ ఇచ్చాయి. బీజేపీ అధికారికంగా తమ అభ్యర్దులను ఖరారు చేసింది. దీంతో, ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ తెలంగాణలో అభ్యర్దుల విషయంలో తన ఛాయిస్ ఏంటో స్పష్టం చేసారు. ప్రత్యర్ధి పార్టీల అభ్యర్దులకు ధీటుగా తమ అభ్యర్దుల బలా బలాలను వివరించారు. అందులో భాగంగా తాజాగా పార్టీలో చేరిన వారికి ఎక్కడ అవకాశం ఇవ్వాలనే దాని పైన నిర్ణయానికి వచ్చారు. రేవంత్ సూచనలతో పాటుగా వ్యూహకర్త సునీల్ కనుగోలు సూచనలతో పార్టీ ఎన్నికల కమిటీ తెలంగాణలో అభ్యర్దుల ఎంపిక పైన ఒక నిర్ణయానికి వచ్చింది.

 

రేవంత్ ఛాయిస్ : కాంగ్రెస్ ఇప్పటికే మహబూబ్‌నగర్‌-వంశీచంద్‌ రెడ్డి, మహబూబాబాద్‌- బలరాం నాయక్‌, జహీరాబాద్‌ – సురేశ్‌ షెట్కార్‌, నల్లగొండ – కుందూరు రఘువీర్‌ రెడ్డి పేర్లను ప్రకటించింది. ఇప్పుడు పార్టీ నుంచి అందుతున్న సమాచారం మేరకు మల్కాజిగిరి లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా సునీతా మహేందర్‌ రెడ్డి పేరు ఖరారు చేశారు. చేవెళ్ల అభ్యర్థిగా ఇటీవల పార్టీలో చేరిన రంజిత్‌ రెడ్డిని, సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా దానం నాగేందర్‌ను ఎంపిక చేశారు. ఇక, నాగర్‌ కర్నూల్‌ అభ్యర్థిగా మల్లు రవి, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, మెదక్‌ నుంచి నీలం మధు, నిజామాబాద్‌ నుంచి జీవన్‌ రెడ్డి పేర్లు ఖరారయ్యాయి. దీని ద్వారా తెలంగాణలో మరో ఏడు స్థానాలకు లోక్‌సభ అభ్యర్థులను కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ ఖరారు చేసింది. కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ సమావేశం దాదాపు మూడు గంటలపాటు జరిగింది.

 

జాబితా సిద్దం : తెలంగాణ నుంచి పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. ఈనెల 21న మిగిలిన ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, భువనగిరి స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాలు, సర్వే నివేదికల ఆధారంగా అభ్యర్దులను ఎంపిక చేస్తున్నారు. సికింద్రాబాద్ స్థానం పైన రేవంత్ ప్రత్యేకంగా గురి పెట్టారు. ఇక్కడ దానం నాగేందర్ ను బరిలోకి దింపటం ద్వారా కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే, ప్రధాని మెదీ ఇప్పటికే కొద్ది రోజుల తేడాతో రెండు సార్లు ప్రచారం చేసారు. రేవంత్, ప్రియాంకను సైతం ప్రచారానికి రావాలని రేవంత్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది.