National

లోక్ సభ ఎన్నికల తొలి దశ నోటిఫికేషన్ విడుదల-మొదలైన నామినేషన్లు..!

లోక్ సభ ఎన్నికల తొలి దశ పోరు నోటిఫికేషన్ ఇవాళ విడుదలైంది. 21 రాష్ట్రాల్లోని 102 లోక్ సభ నియోజకవర్గాలకు జరిగే తొలిదశ పోలింగ్ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేశారు. దీంతో ఆయా సీట్లలో నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. లోక్ సభ తొలి దశ ఎన్నికల నామినేషన్లను ఈ నెల 27 వరకూ స్వీకరిస్తారు. అనంతరం నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ఉంటాయి. ఆ తర్వాత బరిలో ఉన్న తుది అభ్యర్ధుల జాబితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత ఏప్రిల్ 19న తొలిదశ పోలింగ్ ఉంటుంది.

 

 

లోక్ సభ తొలి దశ పోలింగ్ కు నామినేషన్లను ఈ నెల 27 వరకూ స్వీకరించిన తర్వాత 28న పరిశీలన చేస్తారు. ఈ నెల 30 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. లోక్ సభ తొలి దశ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో తమిళనాడులో 39 సీట్లు, రాజస్తాన్ లో 12 సీట్లు, ఉత్తర్ ప్రదేశ్ లో 8 సీట్లు, మధ్యప్రదేశ్ లో 6 సీట్లు, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అసోంలో ఐదేసి సీట్లు, బీహార్లో 4 సీట్లు, బెంగాల్ లో 3 సీట్లు, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయలో రెండేసి సీట్లు, ఛత్తీస్ ఘడ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూ కశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో ఒక్కో సీటు ఉన్నాయి.

 

ఏప్రిల్ 19న జరిగే తొలి దశ పోలింగ్ తో మొదలై జూన్ 1న ఏడో దశ పోలింగ్ తో లోక్ సభ ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. అన్ని దశల పోలింగ్ ఓట్లను జూన్ 4న లెక్కించి అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. మరోవైపు ఏపీలో ఎన్నికలను నాలుగోదశలో మే 13న నిర్వహించబోతున్నారు. ఏప్రిల్ 20న దీని కోసం నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు నామినేషన్ల ప్రక్రియతో మొదలు పెట్టి మే 13న పోలింగ్, జూన్ 4 న కౌంటింగ్ తో ఈ ప్రక్రియ ముగియనుంది.