National

నేడు కోర్టుకు అరవింద్ కేజ్రీవాల్ కస్టోడియల్ ఇంటరాగేషన్ కోరనున్న ఈడీ..

ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ ను విచారించాలని ఇప్పటికి 9 సార్లు సమన్లు జారీ చేసినప్పటికీ, అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరు కాకపోవడంతో నిన్న రాత్రి సెర్చ్ వారెంట్ తో అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి వెళ్ళారు ఈడి అధికారులు .

 

ఈ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ వ్యవహారంలో రెండున్నర గంటలపాటు అరవింద్ కేజ్రీవాల్ ను ప్రశ్నించి, ఆపై ఆయనను అరెస్ట్ చేసి, రాత్రి 11 గంటలకు ఈడీ ప్రధాన కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఇక నేడు అరవింద్ కేజ్రీవాల్ కు ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించి, ఈడీ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కోర్టు అనుమతితో ఆయనను కస్టడీలోకి తీసుకొని ఈ కేసులో విచారణ కొనసాగించాలని ఈడి అధికారులు నిర్ణయించినట్లు సమాచారం.

 

ఈ కేసులో విచారణకు హాజరు కాకుండా కోర్టును ఆశ్రయించిన అరవింద్ కేజ్రీవాల్ కు రక్షణ కల్పించలేమని ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈడీఅధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. అయితే ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గురువారం రాత్రి అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు. కానీ సుప్రీంకోర్టు కేజ్రీవాల్ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఇంతలోనే ఆయన అరెస్టు జరిగిపోయింది.

 

ఇక నేడు సుప్రీంకోర్టులో ఈ పిటీషన్ పై విచారణ అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం వెనుక దేశంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తుంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ బిజెపి కక్షసాధింపు చర్యగా అభివర్ణిస్తుంది.

 

కాగా నేడు అరవింద కేజ్రీవాల్ ను స్థానిక కోర్టులో ప్రవేశపెట్టనున్న ఈడీ అధికారులు ఆయనను కస్టోడియల్ ఇంటరాగేషన్ కోరనున్న నేపధ్యంలో ఈ కేసులో కోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అన్నది అందరిలోనూ ఉత్కంఠను రేకెత్తిస్తుంది.