National

కేజ్రీవాల్ ఇంట్లో 150పేజీల కీలక డాక్యుమెంట్లు.. ఈడీ అధికారులు షాక్..

సార్వత్రిక ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆపై మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో భారీ భద్రత నడుమ ఈడీ అధికారులు ఆయన్ను ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు.

 

ఆయనను ఈ కేసులో మరింత విచారణ చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో కస్టడీకి ఇవ్వాలని ఈడి అధికారులు కోరగా, కోర్టు ఆరు రోజులు ఈడీ కస్టడీకి అనుమతించింది. దీంతో నేటి నుంచి కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు విచారించనున్నారు. నిన్న రాత్రంతా కేజ్రీవాల్ ఈడీ ఆఫీసులో లాకప్ లోనే గడిపారు.

ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరవింద్ కేజ్రివాల్ ను అరెస్ట్ చేయడానికి ముందు దాదాపు రెండున్నర గంటల పాటు, ఆయన ఇంట్లో ఈడి అధికారులు సోదాలు చేశారు. ఈ తనిఖీలలో వారు కీలక డాక్యుమెంట్ లను స్వాధీనం చేసుకున్నారు. అయితే వారు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లలో ఈడీకి సంబంధించిన కీలక సమాచారం ఉందని తెలుస్తోంది.

 

దాదాపు 150పేజీలున్న ఆ డాక్యుమెంట్లలో ఈడి అధికారులకు సంబంధించిన కీలక సమాచారం ఉంది. ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు చెందిన ఇద్దరు అధికారుల గురించి సమగ్ర సమాచారం అందులో ఉందని సమాచారం.ఈడీ స్పెషల్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారులకు సంబంధించిన విషయాలు కావటంతో భద్రతాకారణాలతో గోప్యంగా ఉంచినట్లు తెలుస్తుంది. అయితే ఇందులో ట్విస్ట్ ఏమిటంటే ఆ డాక్యుమెంట్ లలో సమాచారం ఉన్న ఒక అధికారి ఈ దాడులలో పాల్గొన్నారు.

 

అరవింద్ కేజ్రీవాల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల సమాచారం ఎందుకు సేకరించారు అన్నది తెలియాల్సి ఉంది. స్పెషల్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారుల సమగ్ర సమాచారం కేజ్రీవాల్ వద్ద ఉండడంతో అది చూసిన ఈడి అధికారులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. దీనిపై తదుపరి చర్యల కోసం ఉన్నతాధికారుల దృష్టికి ఈ డాక్యుమెంట్లను తీసుకెళ్లినట్టు తెలుస్తుంది.