దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది. ఏప్రిల్ 19తో మొదలుపెట్టి జూన్ 1 వరకూ ఏడు విడతల్లో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. వీటితో పాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించేందుకు వీలుగా షెడ్యూల్ విడుదల చేశారు. ఇప్పటికే లోక్ సభకు తొలి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల సిబ్బందికి చెల్లించే రెమ్యునరేషన్లను ఈసీ తాజాగా ఖరారు చేసింది.
ఈసారి ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బందికి మొత్తం 9 కేటగిరీల వారీగా రెమ్యునరేషన్ (పారితోషకం) చెల్లించాలని ఈసీ నిర్ణయించింది. ఇందులో కింది స్దాయిలో ఉన్న సిబ్బంది నుంచి మొదలుపెట్టి వివిధ విభాగాల్లో ఈ పారితోషకాల చెల్లింపు ఉండబోతోంది. వీటిలో సెక్షన్ ఆఫీసర్ కు రూ.5 వేలు చెల్లించనున్నారు. మాస్టర్ ట్రైనర్ కు రూ.2 వేలు చెల్లిస్తారు. ప్రిసైడింగ్ అధికారి, కౌంటింగ్ సూపర్ వైజర్, రిసెప్షన్ సూపర్ వైజర్ కు రోజుకు రూ.350 చొప్పున చెల్లిస్తారు.
అలాగే పోలింగ్ అధికారులు, కౌంటింగ్ అసిస్టెంట్లు, రిసెప్షన్ అసిస్టెంట్లకు రోజుకు రూ.250 చొప్పున చెల్లిస్తారు. క్లాస్ 4 లేదా ఎంటీఎస్ లకు రోజుకు రూ.200 చొప్పున చెల్లిస్తారు. ఎన్నికల సిబ్బందికి ప్యాక్ చేసిన లంచ్ లేదా రిఫ్రెష్ మెంట్ ఒక్కో దానికి రోజుకు రూ.150 చొప్పున ఇస్తారు. వీడియో సర్వైలెన్స్ టీమ్, వీడియో చూసే టీమ్, అకౌంటింగ్ టీమ్, ఖర్చుపై నిఘా పెట్టే కంట్రోల్ టీమ్, కాల్ సెంటర్ సిబ్బంది, మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ, ఫ్లయింగ్ స్క్వాడ్ లు, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ లో ఉన్న వారికి క్లాస్ 1 లేదా క్లాస్ 2 అయితే రూ.1200 చొప్పున, క్లాస్ 3 అయితే వెయ్యి చొప్పున, క్లాస్ 4 అయితే రోజుకు 200 చొప్పున చెల్లిస్తారు.
మైక్రో అబ్జర్వర్లకు వెయ్యి రూపాయలు ఇస్తారు. అసిస్టెంట్ ఎక్స్ పెండిచర్ అబ్జర్వర్ కు ఫుల్ టైమ్ డ్యూటీ చేస్తే 7500 ఇస్తారు. పాక్షికంగా విధులు నిర్వహిస్తే రోజుల వారీగా లెక్కించి ఇస్తారు. ఇవే మొత్తాలు ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులకు కూడా చెల్లించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.