National

అమృత్‌సర్‌ స్వర్ణ దేవాలయంలో కాల్పుల కలకలం..!

పంజాబ్‌లోని అమృత్‌సర్‌ స్వర్ణ దేవాలయం వద్ద కాల్పులు కలకలం రేగాయి. శిక్ష అనుభవించేందుకు మాజీ డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ దేవాలయానికి వెళ్లారు. ఆయన మెడలో పలక తగిలించుకొని ఆలయం బయట కూర్చున్నారు.

 

ఆ సమయంలో ఓ వ్యక్తి తుపాకీతో బాదల్‌పై కాల్పులు జరిపేందుకు యత్నించాడు. వెంటనే అప్రమత్తమై బాదల్‌ అనుచరులు అతడ్ని అడ్డుకున్నారు. ఈ ఘటనలో సుఖ్‌బీర్ సింగ్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ఇంతకీ కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరు?

 

పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్ అధికారంలో ఉన్నప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలో ఆ పార్టీ నేత, మాజీ డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్ సింగ్ మతపరమైన తప్పిదాలకు పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో మాజీ డిప్యూటీ సీఎంకు శిక్ష విధించింది అకాల్‌ తఖ్త్‌.

 

అమృతసర్‌లోని స్వర్ణ దేవాలయంలో సేవకుడిగా పని చేయాలని ఆదేశించింది. ముఖ్యంగా పాత్రలు, బూట్లు శుభ్రం చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయన తన శిక్ష అనుభవిస్తున్నారు. మంగళవారం నుంచి సుఖ్‌బీర్ సింగ్ శిక్ష అమల్లోకి వచ్చింది. బుధవారం ఉదయం తాను చేసిన తప్పులను అంగీకరిస్తూ రాసి వున్న చిన్న బోర్డును మెడలో వేసుకుని దేవాలయం బయట కూర్చొన్నారు.

 

ఆయన చుట్టూ ఆరుగురు మద్దతుదారులు ఉన్నాయి. ఈ ఉదయం దేవాలయంలోకి చాలామంది వెళ్తుండగా ఓ వ్యక్తి తనతో తెచ్చుకున్న తుపాకీతో కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు. వెంటనే సుఖ్ బీర్ మద్దతుదారులు అతడ్ని అడ్డుకున్నారు.

 

చేతిలో నుంచి గన్ తీసుకున్నారు. అప్పటికే గన్ గాల్లోకి ఫైర్ అయ్యింది. ఇంత జరుగుతున్నా సుఖ్‌బీర్ సింగ్ మాత్రం కుర్చీలో నుంచి ఏ మాత్రం కదల్లేదు. మరికొందరు ఆయనకు రక్షణగా ఉన్నారు. ఈ ఘటనతో పరిసర ప్రాంతాల్లో టెన్షన్ నెలకొంది.

 

పట్టుకున్న వ్యక్తిని పోలీసులకు అప్పగించారు బాదల్ అనుచరులు. దాడి చేసిన వ్యక్తి పేరు నారాయణ్ సింగ్‌గా గుర్తించారు. ప్రస్తుతం అతడ్ని విచారిస్తున్నారు. కాల్పులు జరపడానికి కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు.

 

ఈ వ్యవహారంలో అకాలీదళ్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కుల్పకూలాయని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ అధికారులు తోసిపుచ్చారు. దేవాలయం పరిసర ప్రాంతాలు, మాజీ డిప్యూటీ సీఎంకు సరైన భద్రత ఏర్పాటు చేశామని చెబుతున్నారు. ఇంతకీ నారాయణ్ సింగ్ ఎందుకు కాల్పులు జరిపినట్టు అనేది విచారణలో తేలాల్చివుంది.