National

గ్రామస్తులందరికీ ఊడిపోతున్న జుట్టు.. ఆ మూడు గ్రామాల్లో మిస్టరీ వ్యాధి..?

ప్రస్తుతం హెఎం పివి (HMPV) వైరస్ చైనాలో ప్రబలంగా వ్యాపిస్తోంది. ఈ మహమ్మారి కేసులు మన దేశంలో కూడా నమోదు అవుతున్నాయి. దీంతో భారత ప్రభుత్వం, రాష్ట్రాలు కూడా అలెర్ట్‌గా మారాయి. ఈ వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు పలు మార్గదర్శకాలు జారీ చేశారు అధికారులు. అయితే, హెచ్‌ఎంపీవీ (HMPV) వైరస్‌ భయం ఒకవైపు ఉండగా.. మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో కొత్తగా తెలియని వైరస్ కలకలం సృష్టిస్తోంది. కేవలం వారం రోజుల్లోనే చాలా మంది ప్రజలు తమ తలపై జుట్టు మొత్తం ఊడిపోయే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. బుల్దానా జిల్లా షెగావ్ తాలూకా కలవాడ్, బోండ్‌గావ్, హింగానా గ్రామాల్లో ఈ కొత్త వైరస్ వ్యాపించి, ప్రజలు వింత వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో స్థానికంగా భయాందోళన నెలకొంది.

 

ప్రస్తుతం షెగావ్‌లోని అనేక గ్రామాల్లో ఈ “మిస్టరీ” వ్యాధి వ్యాపించడంతో చాలా మంది ప్రజలు తమ జుట్టు కోల్పోతున్నారు. మొదట తలపై దురద, తరువాత జుట్టు రాలిపోవడం, మూడవ రోజునంతా జుట్టు ఊడిపోవడం, ఇలాంటి లక్షణాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యాధి షెగావ్ సమీపంలోని ఇతర గ్రామాల్లో కూడా వ్యాప్తి చెందింది. గణనీయమైన సంఖ్యలో మహిళలు కూడా ఈ వైరస్ కారణంగా జుట్టు కోల్పోతున్నారు. ఇంతటి తీవ్రత పెరిగిన సమయంలో, అధికారులు ఈ విషయం పై అజాగ్రత్తగా ఉన్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ జుట్టు రాలిపోవడం వంటి సమస్య నుంచి బయటపడేందుకు, చాలా మంది ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.

 

మహిళలకు వారి శిరోజాలపై ఉన్న మక్కువ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ జుట్టు కోల్పోతుండడం, ముఖ్యంగా ఈ కొత్త వైరస్ బారిన పడి, వారికి మరింత బాధ కలిగిస్తోంది. అయితే, ఈ వ్యాధి కారణాలు ఇంకా తెలియరాలేదు. వైద్యుల ప్రకారం, కొన్ని షాంపూ లేదా కండీషనర్స్ వాడటం వల్ల ఈ సమస్య రావచ్చని సూచనలున్నాయి, కానీ శివాసేన నాయకులు, షెగావ్ తాలూకా రామేశ్వర్ థార్కర్, జిల్లా ఆరోగ్య అధికారికి ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో ఈ విషయాన్ని తీవ్రంగా గమనించి, వెంటనే బాధిత గ్రామాల్లో చికిత్స శిబిరాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

 

ఇప్పటివరకు డాక్టర్లు 50 మంది ఈ సమస్య ఉన్నట్లు గుర్తించారు. వారి చర్మం, వెంట్రుకలను పరీక్షల కోసం పంపంచారు. వైద్య నిపుణుల ప్రకారం.. ఈ మూడు గ్రామాల్లో తీవ్ర నీటి కాలుష్యం ఉండే అవాకాశాలున్నాయి. అందుకే ఈ మూడు గ్రామాల్లో కూడా నీటిని సేకరించి.. అందులో అధిక మోతాదులో రసాయనాలు ఎక్కువగా ఉన్న ఫర్టిలైజర్లు ఉన్నాయేమో తెలుసుకునేందుకు పరీక్షలు చేస్తున్నారు.

 

షెగావ్ వైద్యాధికారి డాక్టర్ దిపాలి రాహేకర్ మాట్లాడుతూ.. “ఈ మూడు గ్రామాల్లోని నీటి సాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం పంపించాం. గ్రామస్తులు ఆందోళన చెందకుండా మంచి పౌష్టికాహారం తీసుకోవాలని సూచించాం. త్వరలోనే ఈ సమస్యకు కారణమేంటనేది తెలుసుకుంటాం.” అని ఆమె అశాభావం వ్యక్తం చేశారు.