కొవిడ్ తో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన చైనాలో ఇప్పుడు మరో వైరస్ కేసులు నమోదవడం ఆందోళకరంగా మారింది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. చైనాలోని పరిస్థితుల్ని నిశితంగా పరిశీలించాలని.. ఒకవేళ ఆ కేసులు భారత్ లోకి వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అందించాల్సిన చికిత్సలపై దృష్టిపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు.. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ బోర్డును కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తం చేసింది.
దేశంలో శ్వాసకోశ లక్షణాలు, ఇతర ఫ్లూ కేసులతో ఆసుపత్రులకు వస్తున్న వారికి అన్ని పరీక్షలు నిర్వహించాలని సూచించిన కేంద్ర ఆరోగ్య శాఖ.. అలాంటి కేసుల్ని ప్రత్యేకంగా పరిశీలించాలని కోరింది.
చైనాలో పరిస్థితులు రోజురోజుకు తీవ్రమవుతున్న వేళ.. అంతర్జాతీయ ఏజెన్సీలతో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), ఇతర అనుబంధ ఏజెన్సీల నుంచి డిసెంబర్ 16-22 మధ్య వచ్చిన డేటా ప్రకారం చైనాలో సీజనల్ ఇన్ఫ్లుఎంజా, రైనోవైరస్, రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV) హ్యూమన్ మెటాన్యూమోవైరస్ (HMPV) వంటి తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు తీవ్రమయ్యాయి. దీంతో.. ఈ కేసుల పెరుగుదలను నిశితంగా కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది.