National

దేశీయంగా ప్రభుత్వ బడుల్లో భారీగా తగ్గిన విద్యార్థుల సంఖ్య..

దేశంలోని ప్రభుత్వ పాఠశాల్లలో విద్యార్థుల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల నమోదైందని కేంద్ర పాఠాశాల విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించి రెండు యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (UDISE+) నివేదికల్ని విడుదల చేసింది. ఇందులో 2018-19 తో పోల్చితే 2023-24 విద్యా ఏడాదిలో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్యలోని తగ్గుదలను ప్రస్తావించింది.

 

UDISE+ అనేది ప్రీ-ప్రైమరీ స్థాయి నుంచి హయ్యర్ సెకండరీ వరకు పాఠశాల విద్యార్థులకు సంబంధించిన అన్ని వివరాల్ని తెలియజేస్తుంది. దీనిని కేంద్ర ప్రభుత్వానికి చెందిన UDISE+ నిర్వహిస్తుండగా.. దేశంలోని రాష్ట్రాలు అందించిన సమాచారాన్ని ఇందులో పొందుపరుస్తుంటారు. ఇందులో.. విద్యార్థుల వివరాలతో పాటుగా మౌలిక వసతులు, ఉపాధ్యాయుల సంఖ్య, సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయుల సంఖ్య వంటి అనేక వివరాలతో రూపొందుతుంది. ఈ నివేదిక ఆధారంగానే.. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే అనేక నిధులు ఆధారపడి ఉంటాయి. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు.. విద్యార్థుల మధ్యాహ్న భోజనం కోసం అందించే.. పీఎం- పోషన్ నిధులు, సమగ్ర శిక్షా అభియాన్ సహా అనేక ఇతర పతకాలకు నిధుల్ని కేటాయించేటప్పుడు ఈ డేటాను ఆధారంగా చేసుకుంటారు.

 

2018-19 నుంచి 2021-22 వరకు దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థుల నమోదు 26 కోట్లకు పైగా ఉన్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. కాగా.. కొవిడ్ సమయంలో అన్ని వ్యవస్థలు స్థంభించిపోగా… 2020-21 ఏడాదిలో విద్యార్థుల సంఖ్యలో తగ్గుదల కనిపించింది. లేదంటే.. ఏటా కొన్ని లక్షల మంది విద్యార్థుల పెరుగుదల నమోదవుతుంటుంది. కానీ.. గడిచిన రెండేళ్లుగా విద్యార్థుల సంఖ్యలో తగ్గుదలను కేంద్రం గమనించింది. మొదటి సారిగా.. 2022-23లో దేశవ్యాప్తంగా విద్యార్థుల సంఖ్య 25.17 కోట్లకు పడిపోగా, 2023-24లో ఈ సంఖ్య ఏకంగా 24.8 కోట్లకు పరిమితమైనట్లు నివేదికలు తెలుపుతున్నాయి.

 

నమోదు తగ్గడానికి కారణం ఏమిటి?

 

ప్రభుత్వ పాఠాశాల విద్యార్థుల సంఖ్యలో నమోదు ఈ స్థాయిలో తగ్గుదలకు ఎక్కువ మంది పిల్లలు బడి మానేసినట్లు అర్థం చేసుకోవద్దని విద్యా మంత్రిత్వ శాఖ అధికారులు అంటున్నారు. తాజా UDISE+ నివేదికల కోసం డేటా సేకరించిన పద్దతే అందుకు కారణం అంటూ సమర్థిస్తున్నారు. ఎందుకంటే.. గతంలో దేశంలోని పాఠశాలల వారీగా డేటా సేకరించేవారు. అంటే.. ఎక్కడ పాఠశాల ఉంది. అందులో బాలులు ఎంత మంది, బాలికలు ఎంత మంది.. వారు ఏఏ తరగతులు చదువుతున్నారు అనే వివరాలు ఉండేవి. కానీ.. కొత్త పద్ధతిలో 2022-23 నుంచి డేటా సేకరణలో పూర్తి మార్పులు చేసినట్లు తెలుపుతున్నారు. అంటే.. విద్యార్థుల వారీగా ప్రతీ విద్యార్థి వివరాల్ని నమోదు చేయడంతో ఈ వ్యత్యాసం కనిపిస్తుందని చెబుతున్నారు.

 

కొత్త విధానంలో విద్యార్థి వివరాలు, పేరు, చిరునామా, తల్లిదండ్రుల పేరు, ఆధార్ వివరాలను UDISE+ సిస్టమ్‌లో నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కొత్త విధానంలో ప్రతి విద్యార్థి కోసం 60కి పైగా అంశాలతో డేటా సేకరినట్లు అధికారులు తెలుపుతున్నారు. ఈ విధానంతో నకిలీ విదార్థుల సమస్య తగ్గిపోయిందంటున్నారు. అంటే.. ప్రభుత్వ ప్రయోజనాల కోసం ప్రభుత్వ బడుల్లో చేరి, ప్రైవేట్ పాఠశాలలకు వెెళ్లే పిల్లలు, అలాగే.. కొన్ని బడుల్లో కొందరు ఉపాధ్యాయులు ఎంటర్ చేసే నకిలీ నమోదులు నివారించేందుకు వీలు కలిగిందని చెబుతున్నారు. ఈ వివరాల్ని పాఠశాల క్లస్టర్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ దశల్లో ధృవీకరణ జరిగిందని చెబుతున్నారు.

 

కాగా.. 2018-19 నుంచి 2023-24 వరకు సేకరించిన విద్యార్థుల సంఖ్యలో బీహార్‌లో అత్యధికంగా 35.65 లక్షల మంది, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 28.26 లక్షల మంది విద్యార్థుల తగ్గుదల నమోదైనట్లు గుర్తించారు. ఇలా.. లోతైన కారణాలతోనే విద్యార్థుల సంఖ్య తగ్గిందని సమర్థించుకుంటున్న విద్యా శాఖ అధికారులు.. అంత స్థాయిలో విద్యార్థులు బడులు మానేసినట్లు భావించవద్దని చెబుతున్నారు.