భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా 2023, ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా ల్యాండ్ అయింది. దీంతో చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. అలాగే, చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న తొలి దేశంగానూ రికార్డులకెక్కింది.
విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశానికి ‘శివశక్తి’ అని భారత్ నామకరణం చేసింది. ఈ నేపథ్యంలో ఈ శివశక్తి ప్రాంతానికి సంబంధించి ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. భూమిపై జీవం ఆవిర్భవించడానికి ముందే ఈ ప్రాంతం ఆవిర్భవించిందని ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించారు. చంద్రుడి దక్షిణ ధ్రువానికి దగ్గరగా ఉన్న ఈ ప్రాంతానికి సంబంధించిన తొలి భౌగోళిక పటాన్ని ‘ఇండియన్ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ’ బృందం రూపొందించింది.
ఈ పటాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఇది 370 కోట్ల సంవత్సరాల పూర్వం ఏర్పడి ఉంటుందని అంచనా వేశారు. భూమిపై తొలి జీవ రూపాలు కూడా అదే సమయంలో ఆవిర్భవించాయి. భౌగోళిక మ్యాపింగ్ అనేది ఓ ప్రాథమిక ప్రక్రియ అని ల్యాబొరేటరీ బృందం పేర్కొంది. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు ‘సైన్స్ డైరెక్టర్’ మ్యాగజైన్‌లో ప్రచురితమయ్యాయి.