National

ఢిల్లీ కొత్త సీఎం రేఖా గుప్తా గురించిన ఆసక్తికర వివరాలు..!

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఈరోజు ప్రమాణస్వీకారం చేయనున్నారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 48 సీట్లను బీజేపీ కైవసం చేసుకుని ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

 

ఢిల్లీకి కాబోయే సీఎం రేఖా గుప్తా తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికవడం గమనార్హం. ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే ఆమె అత్యున్నత సీఎం పదవిని చేపట్టబోతున్నారు. విద్యార్థి దశ నుంచే రేఖా గుప్తా నాయకురాలిగా ఎదిగారు. ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలిగా, జనరల్ సెక్రటరీగా ఆమె వ్యవహరించారు. ఢిల్లీ బీజేపీ మహిళా మోర్చా జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ కమిటీ సభ్యురాలిగా పని చేశారు.

 

1992లో ఆమె రాజకీయ ప్రయాణం మొదలయింది. దౌలత్ రామ్ కాలేజ్ లో చదువుతున్నప్పుడు ఆమె ఏబీవీపీలో చేరారు. ఆ తర్వాత 1996-97లో ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలు అయ్యారు. విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా విద్యార్థుల సమస్యలపై ఆమె పోరాడారు.

 

2007లో ఆమె నార్త్ పీతంపురా నుంచి కౌన్సిలర్ గా గెలుపొందారు. లైబ్రరీలు, పార్కులు, స్విమ్మింగ్ పూల్స్ వంటి వసతుల విస్తరణకు కృషి చేశారు. 2012లో కౌన్సిలర్ గా మరోసారి గెలుపొందిన రేఖ… సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా ఎన్నికయ్యారు. మేయర్ గా పని చేస్తున్న సమయంలో పాలనకు సంబంధించిన అనుభవాన్ని ఆమె మెరుగుపరుచుకున్నారు. ఆర్థికంగా వెనుకబడిన బాలికల ఉన్నత చదువుల కోసం ‘సుమేధ యోజన’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళా సాధికారత కోసం ఆమె ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. మహిళలు, బలహీనవర్గాల కోసం ఆమె చేసిన కృషి… ఆమెకు మంచి నాయకురాలిగా పేరు, ప్రఖ్యాతులను తీసుకొచ్చింది.