National

కేంద్రంపై పోరుకు స్టాలిన్ కీలక నిర్ణయం..

వచ్చే ఏడాది చేపట్టే నియోజకవర్గాల పునర్ విభజన, హిందీ వివాదాలపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో విభేధిస్తున్న తమిళనాడు ప్రభుత్వం ఇక అమీతుమీకి సిద్ధమైంది. ఇందుకోసం మిగతా అన్ని పార్టీల్ని పోగేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే ఛీఫ్ ఎంకే స్టాలిన్ అఖిలపక్ష సమావేశం నిర్వహించబోతున్నారు.ఇందులో పాల్గొనాలని అన్ని పార్టీల నేతలకు సందేశాలు పంపుతున్నారు.

 

దేశవ్యాప్తంగా 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉంది. ఇందులో ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లను భారీగా పెంచేస్తున్న కేంద్రం.. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందని స్టాలిన్ ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు. జనాభా ప్రాతిపదికన ఈ సీట్లు పెంచుతున్నట్లు కేంద్రం చేస్తున్న వాదనను ఆయన వ్యతిరేకిస్తున్నారు. అలాగే హిందీ భాషను బలవంతంగా రుద్దే ప్రయత్నాలపైనా మండిపడుతున్నారు. పీఎం శ్రీ స్కూళ్ల పేరుతో దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న విద్యాలయాల్లో తప్పనిసరిగా హిందీ భాషను అమలు చేయాలంటూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల్ని తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

 

ఈ నేపథ్యంలో మార్చి 5న అఖిలపక్ష భేటీ నిర్వహించి ఈ ప్రయత్నాలను అడ్డుకోవాలని సీఎం స్టాలిన్ నిర్ణయించారు. ఇందుకోసం ఆయన అన్ని పార్టీలకు ఆహ్వానాలు పంపుతున్నారు. అయితే తాము ఈ భేటీకి హాజరు కాబోమని తమిళనాడులో విపక్ష బీజేపీ ప్రకటించింది. ఈ భేటీకి హాజరు కాబోమని బీజేపీ ప్రకటించినా ఆ పార్టీ మిత్రపక్షం అన్నాడీఎంకే మాత్రం తాము వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. దీంతో బీజేపికి షాక్ తగిలినట్లయింది. దీంతో డీఎంకే మరింత ఉత్సాహంగా ముందుకెళ్లాలని భావిస్తోంది.