లోక్‌సభలో సవరించిన ఆర్థిక బిల్లు 2025ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. 35 సవరణల తర్వాత మంగళవారం (మార్చి 25) లోక్‌సభ ఆర్థిక బిల్లు 2025 ఆమోదం పొందింది. ఈ సవరణలలో.. ఆన్‌లైన్ ప్రకటనలపై 6 శాతం డిజిటల్ పన్ను, గూగుల్ పన్నులను నుంచి ప్రజలకు ఊరట లభించనుంది. దీంతో లోక్‌సభలో ఈ బిల్లు ప్రక్రియ పూర్తయింది. పన్ను చెల్లింపుదారులకు ఈ బిల్లు.. పన్ను ఉపశమనాన్ని అందిస్తుందని నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా అభివర్ణించారు. ఈ బిల్లు వ్యాపారులకు, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. తదుపరిగా సవరించిన ఆర్థిక బిల్లు 2025 ను రాజ్యసభ కూడా ఆమోదించినట్లయితే, ఈ బిల్లు చట్టంగా మారుతుంది. 2025-26 కేంద్ర బడ్జెట్‌లో మొత్తం వ్యయం రూ.50.65 లక్షల కోట్లను ప్రతిపాదించారు. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే 7.4 శాతం ఎక్కువ.
అంతకుముందు సోమవారం (మార్చి 24) లోక్‌సభలో ముఖ్యమైన పన్ను సంస్కరణల గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచనప్రాయంగా తెలిపారు. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితిని తొలగించడానికి, ఆన్‌లైన్ ప్రకటనలపై ఈక్వలైజేషన్ రుసుమును రద్దు చేస్తామని ఆమె చెప్పారు. దీంతో రూ. లక్ష కోట్ల ఆదాయ నష్టం ఉన్నప్పటికీ, 2025-26లో వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లలో 13.14 శాతం వృద్ధి అంచనా వాస్తవికమైనదేనని ఆమె అన్నారు. ఆన్‌లైన్ ప్రకటనలకు 6 శాతం ఈక్వలైజేషన్ ఫీజును రద్దు చేయనున్నట్లు తెలిపారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదిత బడ్జెట్‌లో.. కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉన్న పథకాలకు రూ.5,41,850.21 కోట్లు కేటాయించగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ.4,15,356.25 కోట్లుగా ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో కొన్ని అనివార్య ఖర్చుల వల్ల వ్యయం పెరిగింది. ఇది కాకుండా, ఈ ఆర్థిక సంవత్సరం 2026లో ఆర్థిక లోటు 4.4 శాతంగా ఉంటుందని అంచనా వేయగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 4.4 శాతంగా ఉంది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి స్థూల దేశీయోత్పత్తి రూ. 3,56,97,923 కోట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే 10 శాతం ఎక్కువ.
కస్టమ్స్ సుంకంలో హేతుబద్ధమైన మార్పులు దేశంలో తయారీని పెంచుతాయని, ఎగుమతులను పెంచుతాయని, ద్రవ్యోల్బణం నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగిస్తాయని సీతారామన్ అన్నారు. కొత్త ఆదాయపు పన్ను బిల్లును తదుపరి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చర్చిస్తామని ఆమె చెప్పారు. లోక్‌సభలో ఆర్థిక బిల్లు 2025 పై చర్చకు సమాధానమిస్తూ, ఫిబ్రవరి 13న సభలో ప్రవేశపెట్టిన కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రస్తుతం సెలెక్ట్ కమిటీ పరిశీలిస్తోందని సీతారామన్ అన్నారు.
రాజ్యసభలో డిజాస్టర్ అమెండ్‌మెంట్ బిల్లు ఆమోదం
విపత్తు నిర్వహణ (సవరణ) బిల్లు 2024ను పార్లమెంట్ ఆమోదించింది. ఈ చట్టం అన్ని విపత్తులను మెరుగ్గా నిర్వహించడంలో రాష్ట్రాలకు సహాయపడుతుందని ప్రభుత్వం తెలిపింది. లోక్ సభలో ఈ బిల్లు గతేడాది డిసెంబర్‌లో ఆమోదం పొందగా.. మంగళవారం రాజ్యసభలో మూజువాణి ఓటుతో ఆమోదించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా బిల్లును ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లుకు ప్రతిపక్ష సభ్యులు ప్రతిపాదించిన సవరణలను సభ తిరస్కరించింది. రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఈ అంశంపై విపక్ష సభ్యులు ఇచ్చిన సూచనల ఆధారంగా ప్రతిపాదిత సవరణలు రూపొందించామని తెలిపింది.