National

దేశవ్యాప్తంగా 808 ఎఫ్‌ఎం రేడియో స్టేషన్లను ఏర్పాటు

దేశవ్యాప్తంగా 808 ఎఫ్‌ఎం రేడియో స్టేషన్లను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం త్వరలోనే మూడో విడత ఈ-వేలం నిర్వహించనుందని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు.

దేశంలోని 284 నగరాల్లో ఈ-వేలం నిర్వహణ ఉంటుందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 113 నగరాల్లో 388 రేడియో స్టేషన్లు ఉండగా.. వాటి సేవలను మారుమూల ప్రాంతాల్లో విస్తృతపరచడానికి 284 నగరాల్లో 808 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కవరేజీ పెంచేందుకు గానూ మారుమూల ప్రాంతాల్లో రేడియో టవర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఆదివారం ఢిల్లీలో రీజినల్‌ కమ్యూనిటీ రేడియో సమ్మేళన్‌లో ఆయన మాట్లాడారు. రేడియో స్టేషన్లు నిర్వహించడానికి అనుమతులు పొందే ప్రక్రియను సులభతరం చేసినట్లు పేర్కొన్నారు. రేడియో ఎఫ్ఎం ట్రాన్స్‌మీటర్ల ద్వారా దేశంలోని జనాభాకు సేవలందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. మారుమూల, గిరిజన, వామపక్ష తీవ్రవాద ప్రాబల్య ప్రాంతాల్లోని వారికి ఉచితంగా 8 లక్షల డీడీ ఫ్రీ డిష్‌ సెట్‌ టాప్‌ బాక్సులను అందజేయనున్నామని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌ వెల్లడించారు.