National

బెంగాల్ ఆందోళనలు హింసాత్మకం, ముగ్గురు మృతి, కేంద్ర బలగాల ఎంట్రీ..!

వక్ఫ్ సవరణ చట్టాని(Waqf Act)కి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్‌లో కొనసాగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ముర్షిదాబాద్, మాల్దా, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి రోడ్లను నిర్బంధించారు. కొందరు ఆందోళనకారులు హిందువుల నివాసాలు, వాహనాలు లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారు. షాపులు, దుకాణాల్లో దూరిన కొందరు దొంగతనాలకు తెగబడ్డారు.

 

ఈ నిరసనలు ఉద్రిక్తతలకు దారితీయడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు పోలీసులు ధృవీకరించారు. ఘర్షణల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. కాల్పుల్లో మరొకరు మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఆందోళనలను అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

 

కాగా, వక్ఫ్ సవరణ చట్టం మంగళవారం నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్రమైనారిటీ వ్యవహారాల శాఖ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే శనివారం బెంగాల్‌లోని మాల్దా, ముర్షిదాబాద్, దక్షిణ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. వారిని కట్టడి చేసేందుకు ప్రయత్నించిన పోలీసులు, భద్రతా సిబ్బందిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు.

 

ఈ క్రమంలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దీంతో 110 మంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా జంగీపూర్‌లో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని కోల్‌కతా హైకోర్టు నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన ముర్షిదాబాద్ సహా పలు ప్రాంతాల్లో కేంద్ర బలగాలు (సీఏపీఎఫ్) మోహరించి పరిస్థితిని అదుపులోకి తెస్తున్నాయి.

 

వక్ఫ్ చట్టం అమలు చేయబోమంటున్న మమత

బెంగాల్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై స్పందించిన సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ రాష్ట్రంలో వక్ఫ్ చట్టాన్ని అమలు చేయబోమని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. అలాంటప్పుడు ఈ ఆందోళనలు ఎందుకని ప్రశ్నించారు. కేంద్ర నిర్ణయం తీసుకుంది కాబట్టి.. కేంద్రంతోనే ఆందోళనకారులు తేల్చుకోవాలని మమత సూచించడం గమనార్హం.