జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన భారీ చొరబాటు కుట్రను భారత సైన్యం భగ్నం చేసింది. రజౌరీ జిల్లాలోని గంభీర్ ప్రాంతంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో, జైషే మహమ్మద్ (జేఈఎం) ఉగ్రవాద సంస్థకు చెందిన చొరబాటుదారులకు మార్గనిర్దేశం చేస్తున్న ఒక పాకిస్థానీ గైడ్‌ను సైనికులు ప్రాణాలతో పట్టుకున్నారు. సైన్యం జరిపిన కాల్పుల్లో పలువురు ఉగ్రవాదులు గాయపడి వెనక్కి పారిపోయినట్టు అధికారులు తెలిపారు.
రక్షణ శాఖ వర్గాల కథనం ప్రకారం.. ఆదివారం ఎల్‌వోసీ ద్వారా ఉగ్రవాదులను భారత్‌లోకి పంపేందుకు కొత్త ప్రయత్నం జరుగుతున్నట్టు నిఘా వర్గాల నుంచి కచ్చితమైన సమాచారం అందింది. దీంతో భారత సైన్యం, సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) సంయుక్తంగా ఆ ప్రాంతంలో పకడ్బందీ ఆపరేషన్ ప్రారంభించాయి. గంభీర్ సెక్టార్‌లోని దట్టమైన అటవీ ప్రాంతంలో నలుగురైదుగురు వ్యక్తులు భారీ ఆయుధాలతో అనుమానాస్పదంగా సంచరించడాన్ని అప్రమత్తంగా ఉన్న సైనిక బృందాలు గుర్తించాయి.
వెంటనే రంగంలోకి దిగిన సైనికులు వారిని చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఉగ్రవాదులకు మార్గదర్శిగా వ్యవహరిస్తున్న ఒక వ్యక్తిని దళాలు విజయవంతంగా అదుపులోకి తీసుకున్నాయి. మిగిలిన నలుగురు ఉగ్రవాదులు సైన్యం కాల్పుల్లో గాయపడి, ప్రతికూల వాతావరణాన్ని, దట్టమైన పొదలను ఆసరాగా చేసుకుని పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) వైపు పారిపోయినట్టు అధికారులు వివరించారు.
అనంతరం ఆ ప్రాంతంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టగా, ఒక మొబైల్ ఫోన్, పాకిస్థానీ కరెన్సీ సహా కీలక వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తిని పీవోకేలోని కోట్లి జిల్లా, నికియాల్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ ఆరిబ్ అహ్మద్‌గా గుర్తించారు.
ప్రాథమిక విచారణలో ఆరిబ్ కీలక విషయాలు వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. తాను పీఓకే నివాసినని, సరిహద్దుల్లోని పాకిస్థాన్ సైనిక పోస్టులలో ఉన్న అధికారుల ఆదేశాల మేరకే జైషే ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు సహాయం చేస్తున్నానని ఒప్పుకున్నాడు. పారిపోయిన ఉగ్రవాదుల వద్ద భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఉన్నాయని ధ్రువీకరించాడు.