ఆన్‌లైన్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఈ-కామర్స్ వేదిక ‘మింత్రా’పై ఈడీ కేసు నమోదు చేసింది. ఎఫ్‌డీఐ నిబంధనలు ఉల్లంఘించి రూ. 1,654 కోట్ల మేర అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించి ఫారిన్ ఎక్స్చేంజీ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) కింద కేసు నమోదు చేసింది. మింత్రాతో పాటు, అనుబంధ సంస్థలు, డైరెక్టర్లపై అభియోగాలు మోపింది.
హోల్‌సేల్ క్యాష్ అండ్ క్యారీ ముసుగులో మింత్రా, దాని అనుబంధ సంస్థ మల్టీ బ్రాండ్ రిటైల్ ట్రేడ్‌ను నిర్వహిస్తున్నాయని, ఇది ఎఫ్‌డీఐ నిబంధనలకు విరుద్ధమని ఈడీ పేర్కొంది.
మింత్రా తాము హోల్‌సేల్ క్యాష్ అండ్ క్యారీ వ్యాపారంలో నిమగ్నమై ఉన్నామని చెబుతూ విదేశీ పెట్టుబడిదారుల నుంచి వేల కోట్ల రూపాయలు స్వీకరించింది. తమ ఉత్పత్తులను ఎక్కువగా వెక్టర్ ఈ-కామర్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థకు విక్రయించింది. ఆ సంస్థ ఆ ఉత్పత్తులను రిటైల్ కస్టమర్లకు అమ్మింది. వాస్తవానికి మింత్రా, వెక్టర్ ఈ-కామర్స్ ఒకే గ్రూపునకు చెందిన కంపెనీలుగా ఈడీ గుర్తించింది.
మింత్రా హోల్‌సేల్ క్యాష్ అండ్ క్యారీ వ్యాపారం చేస్తున్నామని చెప్పినప్పటికీ వాస్తవానికి మల్టీ బ్రాండ్ రిటైల్ ట్రేడింగ్ నిర్వహిస్తున్నట్లు ఈడీ గుర్తించింది. హోల్‌సేల్ క్యాష్ అండ్ క్యారీ అంటే ఉత్పత్తులను రిటైలర్లకు లేదా హోల్‌సేల్ దుకాణాలకు విక్రయించవచ్చు. కానీ వినియోగదారులకు నేరుగా అమ్మకాలు జరపరాదు. మింత్రా తమ ఉత్పత్తులను వెక్టర్ ఈ-కామర్స్ కు విక్రయించి ఆ సంస్థ ద్వారా రిటైల్ కస్టమర్లకు చేరేలా చూస్తోంది.
అంతేకాకుండా, హోల్‌సేల్ క్యాష్ అండ్ క్యారీ సంస్థలు తమ గ్రూప్ కంపెనీలకు కేవలం 25 శాతం విక్రయాలు మాత్రమే జరపాలి. కానీ మింత్రా వెక్టర్ ఈ-కామర్స్‌కు వంద శాతం ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఒకే గ్రూపునకు చెందిన సంస్థకు ఇలా పూర్తి విక్రయాలు జరపడం ఫెమా నిబంధనలు ఉల్లంఘించడమేనని ఈడీ కేసు నమోదు చేసింది.