APNational

నరేంద్రమోడీ, అమిత్ షాకు తెలియకుండానే జరిగిందా?

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుణ్ని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ కు సంబంధించి వాదనలు ముగిశాయి. బెయిల్ వస్తుందా? రాదా? అనే విషయంలో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. బాబు అరెస్ట్ పై ఏపీలో టీడీపీ నాయకులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు తెలియకుండా జరగదని పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారు.

ఖమ్మంలోని గిరిప్రసాద్ భవన్‌లో జన సేవాదళ్ శిక్షణ శిబిరాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్టును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఆయన నిజంగా తప్పు చేసినప్పటికీ అరెస్టు చేసే పద్ధతి అది కాదని, కనీసం గవర్నర్ అనుమతి కూడా తీసుకోలేదన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తిని అర్ధరాత్రి అరెస్టు చేయటం అప్రజాస్వామికమని మండిపడ్డారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా అనుమతి లేకుండా చంద్రబాబు అరెస్టుకు అవకాశం లేదని, కచ్చితంగా అమిత్ షా పర్మిషన్ ఉందన్నారు. బీజేపీ కుటిల నీతిని చంద్రబాబు ఇప్పటికైనా తెలుసుకోవాలని హితవు పలికారు. పులిమీద స్వారీ చేస్తూ దాన్ని నమ్ముకుంటే ఏమవుతుందో చంద్రబాబు తెలుసుకోవాలని, కనీసం ఆయనకు నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టు చేశారని, కార్యాలయానికి తీసుకెళ్లేలోపు ఫైల్స్ రెడీ చేస్తామని చెప్పారని నారాయణ గుర్తు చేశారు.

రాష్ట్రంలో కక్ష సాధింపు చర్యలు మరింత పెరిగిపోయాయని సీపీఐ రామకృష్ణ వ్యాఖ్యానించారు. అన్నారు. జగన్ మగాడైతే తాడేపల్లిలో ఉండి అరెస్టు చేయించి ఉండాలన్నారు. తిరుపతి సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.