జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యాటకులను ఉగ్రవాదులు మతం అడిగి మరీ కాల్చి చంపారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్ సభలో వెల్లడించారు. ఇది అత్యంత దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. ఉగ్రదాడి జరిగిన వెంటనే భద్రతాబలగాలు అప్రమత్తమయ్యాయని, ఉగ్రవాదుల కోసం వేట ప్రారంభించడంతో పాటు వారు దేశం దాటకుండా ఎక్కడికక్కడ చర్యలు చేపట్టాయని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ పై లోక్ సభలో చేపట్టిన చర్చలో హోంమంత్రి అమిత్ షా ఈ రోజు మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రవాదులను తుదముట్టించేందుకు ‘ఆపరేషన్ మహదేవ్’ చేపట్టినట్లు వివరించారు.
ఈ నెల 22న ఉగ్రవాదుల ఆచూకీ తెలిసిందని, దాచిగామ్ సమీపంలోని మహదేవ్ కొండల్లో ఉగ్రవాదులు దాక్కున్నట్లు గుర్తించామని చెప్పారు. దీంతో మహదేవ్ కొండల్లో గాలింపు చర్యలు చేపట్టి పహల్గమ్ ఉగ్రదాడి సూత్రధారి సులేమాన్ షా తో పాటు ముగ్గురు ఉగ్రవాదులను మన బలగాలు హతమార్చాయని వివరించారు. ఈ క్రమంలోనే తన ప్రసంగానికి పదే పదే అడ్డువస్తున్న ప్రతిపక్ష ఎంపీలకు అమిత్ షా చురకలంటించారు. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ను ఉద్దేశించి.. ‘ఉగ్రవాదుల మతం చూసి బాధపడొద్దు’ అంటూ కౌంటర్ ఇచ్చారు.
పాకిస్థాన్ ను వెనకేసుకు వస్తే మీకు ఏమొస్తుందంటూ ప్రతిపక్ష ఎంపీలను నిలదీశారు. పాకిస్థాన్ తో మీరు చర్చలు జరుపుతారా అని నిలదీశారు. కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఇటీవలి వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. పాక్ ను రక్షిస్తే మీకు ఏమొస్తుందని ప్రశ్నించారు. ఉగ్రవాదులు పాకిస్థాన్ కు చెందిన వారేనని తాము వెల్లడిస్తే ఆధారమేంటని చిదంబరం ప్రశ్నిస్తున్నారని షా గుర్తుచేశారు. ఉగ్రవాదుల దగ్గర పాకిస్థాన్ లో తయారైన చాక్లెట్లు దొరికాయని షా తెలిపారు. ప్రతిపక్ష ఎంపీలు పాకిస్థాన్ ను ఎందుకు వెనకేసుకు వస్తున్నారని హోంమంత్రి నిలదీశారు.
పహల్గామ్ ఉగ్రవాదులను మట్టుబెడితే దేశ ప్రజలతో పాటు ప్రతిపక్ష నేతలూ హర్షం వ్యక్తం చేస్తారని తాము భావించినట్లు అమిత్ షా పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం ప్రతిపక్ష ఎంపీల ప్రశ్నలు, చర్చలో వారి ప్రవర్తన చూస్తుంటే ఉగ్రవాదులను తుదముట్టించడం వారికి ఎలాంటి సంతోషాన్ని కలిగించలేకపోయినట్లు తెలుస్తోందని అమిత్ షా ఆరోపించారు.

