లోక్‌సభలో ‘ఆపరేషన్ సిందూర్’పై జరిగిన చర్చ తీవ్ర రచ్చకు దారితీసింది. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ను విపక్షాలు పదేపదే అడ్డుకోవడంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహనం కోల్పోయారు. విపక్షాలు దేశ విదేశాంగ మంత్రిని నమ్మకుండా, విదేశీ వాదనలను నమ్ముతున్నాయని తీవ్రంగా విమర్శించారు.
పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కాల్పుల విరమణ వాదనలను జైశంకర్ ఖండించారు. మోదీ, ట్రంప్ మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలను విపక్షాలు అడ్డుకోవడంతో అమిత్ షా సభలో జోక్యం చేసుకొని విపక్షాలపై విరుచుకుపడ్డారు.
“విపక్షాలు తమ దేశ విదేశాంగ మంత్రిని నమ్మకుండా, ఇతర దేశాలపై నమ్మకం ఉంచడం ఆక్షేపణీయం. వారి పార్టీలో విదేశీ ప్రాముఖ్యతను నేను అర్థం చేసుకోగలను. కానీ దానిని ఈ సభపై రుద్దడం సరికాదు. అందుకే వారు ఈ రోజు విపక్ష బెంచీలపై ఉన్నారు. రాబోయే 20 సంవత్సరాలు వారు అక్కడే ఉంటారు” అని అమిత్ షా ఘాటుగా విమర్శించారు.
విపక్షాలు అడ్డుకోవడం కొనసాగించడంతో షా మరోసారి జోక్యం చేసుకున్నారు “వారి నాయకులు మాట్లాడినప్పుడు మేం ఓపికగా విన్నాం. రేపు నేను వారు చెప్పిన అబద్ధాలను జాబితా చేస్తాను. ఇప్పుడు వారు సత్యాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంత ముఖ్యమైన అంశంపై విదేశాంగ మంత్రి మాట్లాడుతుంటే ఇలాంటి అడ్డంకులు సరైనవా?” అని ఆయన హెచ్చరించారు.