National

స్వదేశీని మంత్రాన్ని స్వీకరించండి, దేశాన్ని బలోపేతం చేయండి: ప్రధాని మోదీ..

దేశ ప్రజలు ‘స్వదేశీ’ని స్వీకరించి, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బుధవారం నవీ ముంబైలో అంతర్జాతీయ విమానాశ్రయం (NMIA) మొదటి దశను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. స్వదేశీ వస్తువుల వాడకం వల్ల దేశంలో అభివృద్ధి వేగవంతం అవ్వడమే కాకుండా, యువతకు మరిన్ని ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు.

 

“ప్రతి ఒక్కరూ గర్వంగా ‘స్వదేశీ’ అని చెప్పాలి. ఇది ప్రతి పౌరుడికి, మార్కెట్‌కు ఒక మంత్రంలా మారాలి. ప్రజలు దేశీయ వస్తువులను కొనుగోలు చేసి, వాటినే బహుమతులుగా ఇస్తే ఆ డబ్బు తిరిగి మన ఆర్థిక వ్యవస్థకే చేరుతుంది. తద్వారా వృద్ధి, ఉపాధి పెరుగుతాయి” అని ప్రధాని మోదీ వివరించారు. జీఎస్టీ సంస్కరణల వల్ల దేశానికి, ప్రజలకు ఎంతో మేలు జరిగిందని, ఇటీవల ముగిసిన నవరాత్రుల్లో అమ్మకాలు భారీగా జరగడమే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

 

ఈ సందర్భంగా ప్రధాని మోదీ గత యూపీఏ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత పాకిస్థాన్‌పై ఎందుకు దాడి చేయలేదని, ఎవరి ఒత్తిడితో ఆనాటి ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుందో దేశం తెలుసుకోవాలనుకుంటోందని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ బలహీన విధానాల వల్లే ఉగ్రవాదులు రెచ్చిపోయారని, దేశ భద్రత బలహీనపడిందని ఆరోపించారు. తమ ప్రభుత్వానికి మాత్రం దేశ భద్రతే అత్యంత ప్రాధాన్యమని, ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా పాకిస్థాన్‌కు గట్టి సమాధానం ఇచ్చామని గుర్తుచేశారు.

 

అంతేకాకుండా, మహారాష్ట్రలోని గత మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం అనేక అభివృద్ధి ప్రాజెక్టులను నిలిపివేయడం వల్ల దేశానికి తీవ్ర నష్టం వాటిల్లిందని మోదీ విమర్శించారు. నవీ ముంబై విమానాశ్రయం, ఇతర కనెక్టివిటీ ప్రాజెక్టులతో ముంబై నగరం ప్రపంచస్థాయి వృద్ధి కేంద్రంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. “ఈ ఎయిర్‌పోర్ట్ ‘వికసిత భారత్’ సంకల్పానికి ప్రతీక. దీని ద్వారా రైతులు తమ ఉత్పత్తులను యూరప్, గల్ఫ్ దేశాలకు సులభంగా ఎగుమతి చేయవచ్చు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు లబ్ధి చేకూరుతుంది” అని తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ ముంబై మెట్రో లైన్-3 చివరి దశను కూడా ప్రారంభించారు. దీంతోపాటు ‘ముంబై వన్ యాప్’, యువతకు ఉపాధి ఆధారిత శిక్షణ అందించే ‘ముఖ్యమంత్రి షార్ట్-టర్మ్ ఎంప్లాయబిలిటీ ప్రోగ్రామ్ (STEP)’ను కూడా ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రైతులు, ప్రజల కోసం విశేష కృషి చేసిన లోక్‌నేత డీబీ పాటిల్ సేవలను ఆయన స్మరించుకున్నారు.