వికసిత భారత్‌కు సూచికగా 2040లో భారతీయ వ్యోమగామి చంద్రుడిపై అడుగు పెట్టనున్నారని ఇస్రో ఛీఫ్ నారాయణన్ పేర్కొన్నారు. అంతరిక్ష రంగ అభివృద్ధికి ప్రస్తుతం అనేక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.
వాటిలో 80 వేల కేజీలను మోసుకెళ్లే రాకెట్ల తయారీ, 2026లో వ్యోమమిత్ర అనే రోబోను అంతరిక్షంలోకి పంపడం, 2035 నాటికి జాతీయ అంతరిక్ష కేంద్రం, చంద్రుడిపై అధ్యయనానికి వీనస్ ఆర్బిటర్ మిషన్ ఏర్పాటు వంటి లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు తెలిపారు.
2027లో చేపట్టబోయే మానవసహిత గగనయాత్ర మిషన్ ప్రణాళికాబద్ధంగా సాగుతోందని వెల్లడించారు. 2040 నాటికి తొలి మానవసహిత చంద్రయాత్ర చేపట్టాలని ప్రధాన మంత్రి నిర్దేశించారని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఈ అంతరిక్ష యాత్ర కీలకమని ఆయన అన్నారు.
కొన్నేళ్ల క్రితం అంతరిక్ష రంగంలో రెండు లేదా మూడు స్టార్టప్‌లు మాత్రమే ఉండేవని, ప్రస్తుతం ఉపగ్రహ తయారీ, ప్రయోగ సేవలు, అంతరిక్ష ఆధారిత డేటా విశ్లేషణపై అధ్యయనం కోసం 300 కంటే ఎక్కువ స్టార్టప్‌లు పనిచేస్తున్నాయని ఇస్రో చీఫ్ వెల్లడించారు. వ్యవసాయం మొదలు వాహన పర్యవేక్షణ వరకు ఉపగ్రహ ఆధారిత అనువర్తనాల అధ్యయనానికి ఈ ప్రయోగాలు ఉపయోగపడుతున్నాయని తెలిపారు.

