National

చైనాకు ప్రత్యామ్నాయంగా ఇండియా: ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్ ప్రశంసలు

ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్, భారతదేశంపై ప్రశంసలు కురిపించారు. భారతదేశం ఒక సూపర్ పవర్​గా ఎదిగిందని కొనియాడిన ఆయన, 21వ శతాబ్దం భారతదేశానిదేనని స్పష్టం చేశారు. NDTV వరల్డ్ సమ్మిట్​లో ప్రసంగించిన ఆయన, ప్రపంచంలోని కొత్త సూపర్ పవర్​లలో ఒకటిగా, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో చైనాకు ‘ప్రజాస్వామ్య ప్రతిరూపం’గా భారత్ నిలుస్తుందని పేర్కొన్నారు. నాలుగు లేదా ఐదు దశాబ్దాల తర్వాత అమెరికాను వెనక్కి నెట్టి భారత ప్రధాని ‘స్వేచ్ఛా ప్రపంచ నాయకుడు’ హోదాను పొందే అవకాశం ఉందని అబాట్ అభిప్రాయపడ్డారు.

ప్రపంచ పెద్దన్నగా మారాలనుకుంటున్న చైనా ఆశయాలకు ఇండియా అడ్డుకట్ట వేస్తుందని టోనీ అబాట్ అన్నారు. అనేక దేశాలు చైనాకు దూరమవుతుండటం ఈ మారుతున్న సంకేతానికి నిదర్శనమని చెప్పారు. 2022లో ఆస్ట్రేలియాతో, గత నెలలో యునైటెడ్ కింగ్డమ్​తో భారతదేశం సంతకం చేసిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, ప్రజాస్వామ్య ప్రపంచం చైనా నుంచి మారుతున్న సంకేతాలని ఆయన అన్నారు. “భారతదేశం చైనాకు ప్రతిరూపం. ఇది ఇప్పుడు అత్యధిక జనాభా కలిగిన దేశం. భారతదేశం అభివృద్ధి చెందుతోంది. రానున్న రోజుల్లో చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతుంది” అని అబాట్ అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంగా ఇండియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించడాన్ని అబాట్ తప్పుబట్టారు. ట్రంప్‌నకు మద్దతుదారుడైనప్పటికీ, శిక్షాత్మక సుంకాల విషయంలో ఆయన భారతదేశంతో సరైన రీతిలో వ్యవహరించలేదని తాను భావిస్తున్నట్లు తెలిపారు. రష్యాతో కోల్డ్ వార్ సమయంలోనూ అమెరికా సైనిక నియంతృత్వంలో ఉన్న పాకిస్తాన్ వైపు మొగ్గు చూపి పెద్ద తప్పు చేసిందని అబాట్ విమర్శించారు. భారతదేశం ఒక ఉదారవాద ప్రజాస్వామ్యమని, అమెరికా తన స్నేహితులు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలని సూచించారు.