బంగ్లాదేశ్ మహిళల క్రికెట్ జట్టులో సంచలనం సృష్టించిన విషయం ఇది. ప్రముఖ ఫాస్ట్ బౌలర్ జహనారా ఆలం (Jahanara Alam) జాతీయ జట్టు మాజీ సెలక్టర్ మంజూరుల్ ఇస్లాం తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని సంచలన ఆరోపణలు చేసింది. మానసిక ఆరోగ్య కారణాలతో ప్రస్తుతం ఆటకు దూరంగా ఉంటున్న ఆమె, తాను ఇన్నాళ్లుగా ఎదుర్కొన్న వేధింపుల గురించి ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టింది. మహిళల వన్డే ప్రపంచ కప్ 2022 సమయంలో జట్టు యాజమాన్యం నుంచి తనకు అసభ్యకరమైన ప్రతిపాదనలు ఎదురయ్యాయని జహనారా వివరించింది.
తాను మంజూరుల్ ఇస్లాం ప్రతిపాదనలను తిరస్కరించినందుకే తన కెరీర్‌కు అడ్డుపడ్డాడని ఆమె ఆరోపించారు. “నేను ఒకసారి కాదు, చాలాసార్లు ఇలాంటి ప్రతిపాదనలను ఎదుర్కొన్నాను. జట్టులో ఉన్నప్పుడు మా పొట్టకూటి కోసం ఎన్నో విషయాల్లో మౌనంగా ఉండాల్సి వస్తుంది. కొన్నిసార్లు నిరసన తెలపాలని ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి” అని జహనారా ఆవేదన వ్యక్తం చేశారు. సెలక్టర్ అమ్మాయిల దగ్గరికి వచ్చి భుజంపై చేయి వేయడం, చాతీకి అదుముకుని, చెవి దగ్గర మాట్లాడటం అలవాటుగా ఉండేదని, ఒకానొక సందర్భంలో తన దగ్గరకు వచ్చి చేతిని పట్టుకుని “నీ పీరియడ్ వచ్చి ఎన్ని రోజులయింది?” అని అసభ్యంగా అడిగాడని జహనారా గుర్తు చేసుకున్నారు.
ఈ విషయంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)లోని పలువురు సీనియర్ అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందని జహనారా తెలిపారు. మహిళా కమిటీ హెడ్, బీసీబీ సీఈవో సైతం తన ఫిర్యాదులను పట్టించుకోలేదని ఆరోపించారు. కాగా, జహనారా ఆరోపణలపై మంజూరుల్ ఇస్లాం స్పందిస్తూ, అవన్నీ నిరాధారమైనవని కొట్టిపారేశాడు. అయితే, బోర్డు ఉపాధ్యక్షుడు షఖావత్ హొస్సేన్ మాత్రం ఈ ఆరోపణలు చాలా తీవ్రమైనవని, దీనిపై త్వరలోనే సమావేశమై తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని, అవసరమైతే పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడతామని స్పష్టం చేశారు.

