National

శిల్పా శెట్టి కొత్త రెస్టారెంట్: ఉచిత టిఫిన్ కోసం కిలోమీటర్ల మేర క్యూ కట్టిన జనం!

బాలీవుడ్ స్టార్ నటి శిల్పా శెట్టి ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన బాంద్రాలో ‘అమ్మకాయ్’ (Ammaaki) పేరుతో ఒక నూతన రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ యాజమాన్యం “ముందుగా వచ్చిన వారికి ప్రాధాన్యత” అనే ప్రాతిపదికన ఉచిత బ్రేక్‌ఫాస్ట్ (Free Breakfast) ఆఫర్‌ను ప్రకటించింది. ఈ వార్త తెలియగానే తెల్లవారుజాము నుంచే వందలాది మంది ప్రజలు రోడ్లపై బారులు తీరారు. ఉదయం 9 గంటలకు రెస్టారెంట్ ప్రారంభం కావాల్సి ఉండగా, 7 గంటలకే కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపించడం విశేషం.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాంద్రా వంటి సంపన్న ప్రాంతంలో నివసించే వారు, కోట్లాది రూపాయల విలువైన ఫ్లాట్లలో ఉండేవారు కూడా కేవలం ఒక ప్లేట్ ఉచిత టిఫిన్ కోసం గంటల తరబడి రోడ్డుపై నిలబడటం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఉచితంగా ఏది వచ్చినా వదులుకోకూడదనే ఈ రకమైన మనస్తత్వం ప్రజల గౌరవానికి, దేశ పురోగతికి ఆటంకమని పలువురు సామాజిక మాధ్యమాల్లో మండిపడుతున్నారు.

సాధారణంగా ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత పథకాలను విమర్శించే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు.. వ్యక్తిగత ప్రవర్తన దగ్గరకు వచ్చేసరికి ఇలాంటి ఉచితాల కోసం ఎగబడటం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ప్రవర్తన కేవలం ఒక రెస్టారెంట్ పబ్లిసిటీ స్టంట్ వల్ల జరిగిన రచ్చ మాత్రమే కాదని, సామాజికంగా మారాల్సిన ఆలోచనా విధానానికి ఇదొక హెచ్చరిక అని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.