తమిళనాడులోని పెరంబలూరు జిల్లాలో సోమవారం రాత్రి జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ అళగురాజా మరణించాడు. హత్యలు, దోపిడీలు, కాంట్రాక్ట్ మర్డర్లు వంటి దాదాపు 30కి పైగా తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇతను, చాలా కాలంగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఇటీవల మరో నేరగాడిపై జరిగిన దాడి కేసులో ఇతని ప్రమేయం ఉందని గుర్తించిన పోలీసులు, పక్కా సమాచారంతో ఊటీలో అరెస్ట్ చేశారు. ఆయుధాల రికవరీ కోసం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లిన సమయంలో పోలీసులపై దాడికి తెగబడటంతో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం, మంగళమెట్ ఇన్‌స్పెక్టర్ నందకుమార్ బృందం అళగురాజాను పెరంబలూరు జిల్లా తిరుమంతురై సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లింది. అక్కడ నిందితుడు దాచిపెట్టిన ఆయుధాలను బయటకు తీస్తున్న తరుణంలో, అళగురాజా అకస్మాత్తుగా కొడవలితో పోలీసులపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఒక పోలీసు అధికారికి గాయాలు కాగా, హెచ్చరించినప్పటికీ నిందితుడు లొంగిపోకపోవడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. తలకు బుల్లెట్ తగలడంతో అళగురాజా అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు
అళగురాజా మరణం తమిళనాడులోని క్రిమినల్ నెట్‌వర్క్‌కు పెద్ద దెబ్బ అని పోలీసులు భావిస్తున్నారు. ఇతను పలు జిల్లాల్లో తన ముఠాలను నడుపుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో గాయపడిన పోలీస్ అధికారి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. అళగురాజాతో పాటు అరెస్ట్ అయిన మిగిలిన ఆరుగురు అనుచరులను పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. ఈ ఎన్‌కౌంటర్ రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది.

