National

అస్సాంలో కూలిన యుద్ధ విమానం.. భారీ పేలుడు శబ్దం, స్థానికులు బెంబేలు..

అస్సాంలోని కర్బీ అంగ్లాంగ్ జిల్లా పరిధిలోని మారుమూల కొండ ప్రాంతంలో గురువారం సాయంత్రం భారత వాయుసేనకు చెందిన సుఖోయ్-30 యుద్ధ విమానం కూలింది. జోర్హాట్ ఎయిర్‌ బేస్ నుండి బయలు దేరిన కొద్దిసేపటికే యుద్ధ విమానం రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. చొకిహోలా పరిధిలోని కొండ ప్రాంతంలో ఈ ప్రమాదం జరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. అందులోవున్న ఇద్దరు పైలట్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.

 

గురువారం సాయంత్రం అసొంలోని జోర్హాట్‌లోని వైమానిక బేస్ నుండి బయలు దేరింది సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానం. గాల్లోకి ఎగిరిన కాసేపటికి రాడార్ సంబంధాలు కోల్పోయింది. విమానం, ఇద్దరు పైలట్లను గుర్తించడానికి రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. ఈ విమానం రాత్రి 7.42 గంటల సమయంలో గ్రౌండ్ కంట్రోల్‌తో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.

 

యుద్ధ విమానం ప్రమాద సమయంలో కొండల వైపు నుండి భారీ పేలుడు శబ్దం వినిపించిందని స్థానిక గ్రామస్తులు చెబుతున్నారు. కర్బీ అంగ్లాంగ్ జిల్లాలో మారుమూల కొండ ప్రాంతం నుండి పేలుడు శబ్దం వినిపించిందని అంటున్నారు. చీకటి పడిన తర్వాత జరిగిన ఈ పేలుడు ధాటికి సమీపంలోని ప్రజలు ఇళ్ల నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు.

 

పైలట్లు మిస్సింగ్.. గాలింపు ముమ్మరం చేసిన సిబ్బంది

 

శబ్దం వచ్చిన దట్టమైన పొగలు అలుముకున్నాయని పలువురు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతం అడవులు, ఎత్తైన కొండల మధ్య జరిగినట్టు అంచనా వేస్తున్నారు. అటు వైపు వెళ్లడం కాసింత కష్టమేనని చెబుతున్నారు స్థానికులు. ఈ ఘటనపై వైమానిక విభాగం నుంచి ఓ ప్రకటన వచ్చింది. విమానం ఆచూకీ కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేసింది భారత వాయుసేన బృందం.

 

ప్రమాద స్థలం జనవాసాలకు దూరంగా ఉండటంతో ఆయా బృందాలకు కష్టంగా మారింది. దీనికితోడు భౌగోళిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నట్లు సమాచారం. కచ్చితంగా విమానం క్రాష్ అయినట్టు అధికారులు భావిస్తున్నారు. మరి విమానంలోని పైలట్ల పరిస్థితి ఆరా తీస్తున్నారు. ఇంతకీ వారు సేఫ్‌గా బయటపడ్డారా? ప్రమాదంలో చిక్కుకున్నారా? అనేది ఇంకా క్లారిటీ రావాల్సివుంది.

 

IAF వద్ద 260 కి పైగా Su-30 MKI జెట్‌ విమానాలు ఉన్నాయి. దేశంలో అత్యంత శక్తివంతమైన, ముఖ్యమైన యుద్ధ విమానాల్లో ఇది కూడా ఒకటి. సుఖోయ్-30 MKI విమానం రెండు ఇంజన్లు కలిసి ఉంటుంది. దేశ వైమానిక రంగానికి వెన్నెముక. రష్యాకు చెందిన సుఖోయ్- దేశానికి చెందిన HAL సంయుక్తంగా నిర్మించిన యుద్ధ విమానాలలో ఇది కూడా ఒకటి.