National

వాస్తవాలు అడిగితే లీగల్ నోటీసులా.?

హైదరాబాద్ : ఓఆర్ఆర్ లీజుకు సంబంధించిన వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ మే 25న తనకు ఇచ్చిన లీగల్‌ నోటీసులను వెనక్కి తీసుకోకుంటే ఆయనపై సివిల్‌, క్రిమినల్‌ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు.

ఓఆర్ఆర్ లీజుకు సంబంధించిన వ్యవహారంలో అరవింద్ కుమార్ పంపిన లీగల్ నోటీసుకు రేవంత్‌ తన అడ్వకేట్ ద్వారా మంగళవారం సమాధానం ఇచ్చారు. ఈ సందర్బంగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై ఘాటు వ్యాఖ్యలు చేసారు రేవంత్ రెడ్డి.

 

ఉపసంహరించుకోకపోతే చర్యలు తప్పవన్న రేవంత్..: నెహ్రూ ఓఆర్ఆర్ సగ భాగం తాను ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న మాల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోకి వస్తుందని, అధిక ఆదాయం వచ్చే ఆస్కారం ఉన్నా ఆ దిశగా అలోచన చేయకుండా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి కేవలం రూ.7380 కోట్లకే ఐఆర్బీ సంస్థకు 30 ఏళ్లకు ఓఆర్ఆర్ టోల్ వసూలు టెండర్ కట్టబెట్టారన్నారు రేవంత్. అంతేకాకుండా ఐఆర్బీ టెండర్ కట్టబెట్టే క్రమంలో అన్ని నిబంధనలు యాదేచ్ఛగా ఉల్లంఘించారని, హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ 2031తో ముగుస్తుందన్నారు. 30 ఏళ్లకు లీజుకు ఇస్తే..2031 తర్వాత మాస్టర్ ప్లాన్ మారుతుంది కాబట్టి దాంతో సమస్యలు వస్తాయన్నారు రేవంత్ రెడ్డి.