National

ఢిల్లీలో రైతుల ఆందోళన, చలి తట్టుకోలేక కుప్పకూలిన రైతు, ఆసుపత్రిలో ప్రాణం పోయింది, అర్దరాత్రి..!

వివిధ డిమాండ్ల సాధన కోసం పంజాబ్-హర్యానా సరిహద్దులోని శంభు అడ్డుగోడ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పంజాబ్ రైతు మృతి చెందిన ఘటన వెలుగు చూసింది. శుక్రవారం ఉదయం గుండెపోటుతో ఓరైతు మృతి చెందాడు. మరణించిన అన్నదాతను 78 ఏళ్ల జ్ఞాన్ సింగ్‌గా గుర్తించామని అధికారులు అంటున్నారు.

 

జ్ఞాన్ సింగ్‌ పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నివాసి అని అధికారుల విచారణలో తెలిసింది. గురువారం రాత్రి విపరీతమైన చలితో బాధపడుతున్న జ్ఞాన్ సింగ్‌ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు. జ్ఞాన్ సింగ్‌ను తెల్లవారుజామున 4 గంటలకు స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. అక్కడి నుంచి పాటియాలాలోని ప్రభుత్వాసుపత్రికి జ్ఞాన్ సింగ్‌ ను తరలించారు.

 

అక్కడ జ్ఞాన్ సింగ్‌ కు అత్యవసర విభాగంలో చికిత్స అందించారు. వైద్యులు జ్ఞాన్ సింగ్‌ ప్రాణాలను కాపాడేందుకు అనేక ప్రయత్నాలు చేశారని తెలిసింది. కానీ గంటన్నర పాటు చికిత్స చేసినప్పటికీ జ్ఞాన్ సింగ్‌ మరణించాడు. పంజాబ్-హరియానా సరిహద్దులో కొనసాగుతున్న రైతుల నిరసన 2. 0లో ఒక రైతు మరణించడం ఇది మొదటిసారి అని అధికారులు, రైతులు అంటున్నారు.

 

కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా గతంలో 13 నెలల పాటు సాగిన నిరసనలో 750 మంది రైతులు చనిపోయారు. అయితే ఇప్పుడు రైతు జ్ఞాన్ సింగ్‌ గుండెపోటుతో మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. ఇక్కడికి తీసుకువచ్చేటప్పటికి జ్ఞాన్ సింగ్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయనకు చికిత్స అందించామని డాక్టర్లు తెలిపారు.

 

అయితే చికిత్స విఫలమై ఉదయం 6 గంటలకు జ్ఞాన్ సింగ్‌ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. పాటియాలా జిల్లా కలెక్టర్ షౌకత్ అహ్మద్ పారే కూడా రైతు జ్ఞాన్ సింగ్‌ మృతిని ధృవీకరించారు. గుండెపోటుతో రైతు జ్ఞాన్ సింగ్‌ మృతి చెందినట్లు వైద్యుల రికార్డులు చెబుతున్నాయి. జ్ఞాన్ సింగ్ కిసాన్ మజ్దూర్ మోర్చాలోని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ సమితి సభ్యుడు అని అధికారులు తెలిపారు.