వచ్చే ఎన్నికల్లో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లులో నిర్వహించిన ‘రా.. కదిలిరా’ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అవినీతి, నల్లధనం, అక్రమాలతో జగన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయాలను కలుషితం చేసిన వ్యక్తి జగన్ అని ధ్వజమెత్తారు.
వైసీపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని.. మరో 52 రోజుల తర్వాత టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థులు దొరక్క జగన్ సందిగ్ధంలో పడ్డారన్నారు. వై నాట్ పులివెందుల అనేదే తమ నినాదమని చెప్పారు. చిల్లర రాజకీయాలు వద్దు.. గౌరవంగా రాజకీయాలు చేయడం నేర్చుకోవాలని వైసీపీకి సూచించారు చంద్రబాబు.
మాట్లాడితే జగన్ బటన్ నొక్కానని చెబుతున్నారు.. అందుకే ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలు పెరిగాయని చంద్రబాబు ఎద్దేవా చేశారు. చెత్త, నీరు, ఆస్తిపై పన్నులు పెంచారని మండిపడ్డారు. మద్యపాన నిషేధం, జాబ్ క్యాలెండర్‌పై జగన్ ఎందుకు బటన్ నొక్కలేదని చంద్రబాబు నిలదీశారు. జగన్ పెట్టే ప్రతి స్కీం వెనుక స్కాం ఉంటుందన్నారు. ఇలాంటి దోపిడీ ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. పర్చూరు నియోజకవర్గంలో గ్రానైట్ వ్యాపారులను వైసీపీ నేతలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
మరోవైపు, పోలీసులకు కూడా చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. పోయే ప్రభుత్వాన్ని మోస్తే పోలీసులే మునిగిపోతారన్నారు. టీడీపీ సభను అడ్డుకోవడానికి యత్నించారన్నారు. నోటీసులో ఏం ఉందో చూడకుండా సభ ఆపాలని ఎస్పీ అంటారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. తాము చట్ట ప్రకారం వెళ్తున్నామని.. అడ్డం వస్తే తొక్కుకుని పోతామని హెచ్చరించారు. జగన్‌ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికల ముందే టీడీపీ గెలుపు ఖాయమైందని చెప్పుకొచ్చారు.
ఇప్పటి వరకు మూడు రాజధానులు అన్న జగన్.. ఇప్పుడు నాలుగో రాజధాని హైదరాబాద్ అంటున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. అమరావతి నిర్మాణం ఆపేసి రాష్ట్రంలో ఉపాధి లేకుండా చేశారని మండిపడ్డారు. అమరావతి పూర్తయితే పరిస్థితి మరోలా ఉండేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి.. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.