Uncategorized

అక్కడ కచ్చితంగా గెలవాల్సిందే: సీఎం జగన్ .

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమరాంగణాన తలపడేందుకు అన్ని పార్టీలు అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అధికార వైసీపీ రెండోసారి అధికారంలోకి రావడానికి తీవ్ర ప్రయత్నాల్లో ఉంది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి ఈసారి ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. ఎట్టి పరిస్థితుల్లోను అధికారంలోకి రావాలనే పట్టుదలను ప్రదర్శిస్తున్న ఆ పార్టీ జనసేనతోపాటు బీజేపీని కూడా కలుపుకు వెళ్లాలనే ప్రయత్నాల్లో ఉంది. ఒకవేళ ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడితే అధికార వైసీపీ, ప్రతిపక్ష కూటమి మధ్య మహా యుద్ధం జరుగుతుందని భావిస్తున్నారు.

 

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కీలకమైన నియోజకవర్గం టెక్కలి. ఇక్కడి నుంచి టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా అచ్చెన్నను ఓడించాలనే కృత నిశ్చయంతో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అందుకు తగ్గ వ్యూహాలను సిద్ధం చేస్తోంది. టెక్కలి నియోజకవర్గంగా ఏర్పాటైన తర్వాత తొలిసారిగా 1952లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఆ పార్టీకి శ్రీకాకుళం జిల్లా కంచుకోటగా ఆవిర్భవించింది. 1952 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఐదుసార్లు, తెలుగుదేశం పార్టీ ఎనిమిదిసార్లు, జనతాపార్టీ, స్వతంత్ర పార్టీ చెరోసారి విజయం సాధించాలి. 1994 ఎన్నికల్లో టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు ఇక్కడి నుంచి పోటీచేసి ఘనవిజయం సాధించారు.

 

ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత వరుసగా రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో ఆయనే గెలుపొందారు. మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ సాధించాలనే నిశ్చయంతో ఉండగా, ఎలాగైనా ఈసారి అచ్చెన్నను ఓడించడానికి వైసీపీ శతథా ప్రయత్నిస్తోంది. 2014 ఎన్నికల్లో అచ్చెన్నాయుడు వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్ పై 8,545 ఓట్ల తేడాతో, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ పై 8,387 ఓట్ల తేడాతో గెలుపొందారు. టెక్కలిలో మరోసారి హోరాహోరీ ఎన్నికల సమయం జరగడం మాత్రం ఖాయమని స్పష్టమవుతోంది.